టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ మరోసారి మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టులో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా సీఎం పనులు చేయిస్తున్నారని... అటువంటి చంద్రబాబు ప్రాజెక్ట్‌ విషయంలో కేంద్రప్రభుత్వాన్ని దోషి అని విమర్శించడం హాస్యాస్పదమన్నారు.

పోలవరం ప్రాజెక్టులో దోచుకున్న వారిని వదిలే ప్రసక్తే లేదని కన్నా ఆరోపించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని తిట్టిపోసిన చంద్రబాబు ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకున్నారని లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు.

రాజధాని, పోర్టులు, సెజ్‌ల పేరుతో టీడీపీ సర్కార్ విచ్చలవిడిగా ప్రభుత్వ భూములను కార్పోరేట్ సంస్థలకు కట్టబెడుతోందని మండిపడ్డారు. దీనికి నిరసనగా ఈ నెల 19 నుంచి 24 వరకు నిరాహార దీక్షలకు దిగుతున్నామని ప్రకటించారు. ఓటమి భయంతోనే ప్రతిపక్షాలను చంద్రబాబు అణగదొక్కుతున్నారని కన్నా ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు.