మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనుకుంటున్నట్లు ప్రకటించారు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే  కాండ్రు కమల. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు.  దుగ్గిరాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్లీ అడుగుపెట్టడం ఖాయమని చెప్పారు.  అయితే.. ఏ పార్టీ నుంచి తాను ఏ పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతాను అనే విషయంపై త్వరలో ప్రకటిస్తానని ఆమె వెల్లడించారు.

ఎన్నికల్లో ముందస్తు వ్యూహంతోనే జయాపజయాలు ఉంటాయని, తెలంగాణ ఫలితాలతో ఆంధ్ర ఫలితాలను పోల్చే అవకాశం లేదన్నారు. కేసీఆర్ రాష్ట్రానికి వచ్చి ఏ పార్టీ తరపున ప్రచారం చేసినా.. పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులని, ప్రజల అభీష్టాలను నెరవేర్చే వారికే పట్టం కడతారన్నారు.

కాగా.. 2009 ఎన్నికల్లో కాండ్రు కమల మంగళగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు.  పీఆర్పీ నుంచి పోటీచేసిన తమ్మిశెట్టి జానకీదేవిపై 13వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె.. మళ్లీ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు తెలిపారు.