వెంకటేశ్వరునికి పరమ భక్తుడు

వెంకటేశ్వరునికి పరమ భక్తుడు

కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి తిరుమలలోని వెంకటేశ్వరునికి పరమ భక్తుడు. కంచికి, తిరుమల ఆలయానికి విడదీయరాని బంధముంది. 1954లో కంచిమఠానికి జూనియర్ పీఠాధిపతిగా నియమితులైన వెంటనే అప్పటి పరమాచర్యులు చంద్రశేఖర సరస్వతి ఆదేశాల మేరకు కాలినడకన తిరుమల చేరుకున్నారట. మొదటిసారిగా వేంకటేశ్వరుని ఆశీస్సులు తీసుకున్న దగ్గర నుండి బుధవారం శివైక్యం చెందే వరకూ తరచూ తిరుమలకు వెళుతూనే  ఉన్నారు. ఇన్ని సంవత్సరాల్లో కొన్ని వందలసార్లు తిరుమలలోని శ్రీవారిని దర్శించుకునుంటారు.

తిరుమల దేవాలయంలో జరిగే నిత్యపూజలు, ప్రసాదాలు, ఉత్సవాలు ఏవైనా కావచ్చు కంచిమఠం ఆగమశాస్త్రాల ప్రకారమే జరుగుతాయి. దేవాలయంకు సంబంధించిన ఏ సమస్య తలెత్తినా టిటిడి ఉన్నతాధికారులు వెంటనే కంచిమఠాన్ని సంప్రదిస్తారు. వెంకటేశ్వరునికి జయేంద్ర సరస్వతి బంగారు కిరీటం, బంగారు పాదుకలు, బంగారు జంధ్యం తయారు చేయించి స్వయంగా అలంకరించారు.

కంచిమఠం తరపున ఏ కార్యక్రమం తలపెట్టినా ముందుగా తిరుమలకు వచ్చి వేంకటేశ్వురుని దర్శించి ఆశీస్సులు తీసుకోనిదే మొదలుపెట్టేవారు కారు. మఠం ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్ధలు, హిందుధర్మ వ్యాప్తి కోసం ఏర్పాటు చేసిన ధార్మిక సంస్ధలు, నిత్యాన్నదానం ట్రస్టు ఇలా ఏవి తీసుకున్నా శ్రీవారి ఆశీస్సులు, ఆదేశాలతొనే మొదలైనాయని తరచూ జయేంద్ర భక్తులకు చెప్పేవారు.

ప్రపంచవ్యాప్తంగా హిందువుల్లో కంచిమఠం అంటే ఎంతో భక్తి. దేశ, విదేశాల నుండి ప్రతీ ఏడాది లక్షలాదిమంది భక్తులు కంచిమఠానికి వచ్చి జయేంద్రసరస్వతిని దర్శించుకుని వెళుతుంటారు. భక్తుల విరాళాలతో నడుస్తున్న విద్యాసంస్ధలు ఎంతో ప్రాచుర్యం పొందిన విషయం అందరికీ తెలిసిందే. పేదల కోసం మఠం తరపున నేత్రదానం ట్రస్టును నడుపుతున్నారు.  ఏడాదికి కొన్నివేల మంది రోగులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించి నేత్రదానం చేస్తుంటారు.

శ్వాస సంబంధిత అనారోగ్యంతో బుధవారం తెల్లవారుజామున పరమపదించిన జయేంద్ర సరస్వతి భౌతికకాయాన్ని కంచిమఠంకు చేర్చారు. మఠం వర్గాలు చెప్పిన సమాచారం ప్రకారం గురువారం మఠంలోని సమాధి చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోడితో పాటు పలువురు కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు గురువారానికి కంచికి చేరుకునే అవకాశాలున్నాయి.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos