కడప: కడప జిల్లా రాజకీయాలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో కడప జిల్లాలో పాగా వెయ్యాలని భావిస్తున్న చంద్రబాబు నాయుడుకు పార్టీలోని అసంతృప్తి ముప్పు తిప్పలు పెడుతోంది. 

దశాబ్ధాల శత్రువులు అయిన మంత్రి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలను కలిపి హమ్మయ అనుకున్న చంద్రబాబుకు మరిన్ని తలనొప్పులు వచ్చి పడ్డాయి. ఇప్పటికే రాయచోటి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు టీడీపీ కీలకనేత రెడీ అవుతున్న తరుణంలో ఆ అసంతృప్తిని ఎలా తొలగించాలా అన్న ఆలోచనలో పడ్డారు. 

ఇదిలా ఉంటే కడప జిల్లా రాజకీయాల్లో కీలక నేత, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి చంద్రబాబు నాయుడుపై గుర్రుగా ఉన్నారు. వీరశివారెడ్డి కమలాపురం టికెట్ ఆశించారు. టికెట్ ఆయనకే ఇస్తారని అంతా భావించారు. 

అయితే అనూహ్యంగా చంద్రబాబు నాయుడు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ పుత్తా నరసింహారెడ్డిని ప్రకటించారు. దీంతో అలిగిన వీరశివారెడ్డి తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యారు. సోమవారం చంద్రబాబును కలవనున్నట్లు తెలుస్తోంది.  

టికెట్‌ ఆశించి భంగపడ్డ వీరశివారెడ్డి చంద్రబాబును కలవడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. చంద్రబాబుతో భేటీ అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఇప్పటికే వీరశివారెడ్డి తెలిపారు.