అమరావతి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులుగా పనిచేసిన ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో  కాలువ శ్రీనివాసులు మంత్రిగా పనిచేశారు. జగన్ మంత్రివర్గంలో  కన్నబాబుకు చోటు దక్కింది.

అనంతపురం జిల్లాకు చెందిన కాలువ శ్రీనివాసులు ఈనాడు దినపత్రికలో పనిచేశాడు.  1999 ఎన్నికల్లో  అనంతపురం ఎంపీ స్థానం నుండి కురుమ సామాజిక వర్గానికి చెందిన కాలువ శ్రీనివాసులుకు చంద్రబాబునాయుడు టిక్కెట్టు ఇచ్చారు.  ఈ స్థానం నుండి కాలువ శ్రీనివాసులు పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి అనంత వెంకట్రామిరెడ్డిపై విజయం సాధించాడు.

2004 ఎన్నికల్లో ఈ స్థానంనుండి పోటీ చేసి ఆయన ఓటమి పాలయ్యాడు. 2014 ఎన్నికల్లో  రాయదుర్గం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసిన  కాలువ శ్రీనివాసులు విజయం సాధించారు.

చంద్రబాబునాయుడు తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఈ ఎన్నికల్లో  రాయదుర్గం నుండి  మరోసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ఇక వైఎస్ జగన్ మంత్రి వర్గంలో మాజీ జర్నలిస్టు కురసాల కన్నబాబుకు చోటు దక్కింది. కురసాల కన్నబాబు గతంలో ఈనాడులో పనిచేశారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  2009 ఎన్నికల్లో  కాకినాడ రూరల్ స్థానం నుండి  పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో ఇదే స్థానం నుండి  పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాపు సామాజిక వర్గానికి చెందిన  కురసాల కన్నబాబుకు జగన్ మంత్రివర్గంలో చోటు కల్పించారు.