గుంటూరు: రాష్ట్రంలో సగంపైగా జనాభా ఉన్న వెనుకబడిన తరగతులతో జగన్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. బీసీలు దశాబ్దాల కాలంగా అనుభవిస్తున్న హక్కుల పరిరక్షణలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. 

''ఈ రోజు సుప్రీంకోర్టు గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ 50 శాతానికి లోబడే రిజర్వేషన్లు ఉండాలని చెప్పిన నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు సుప్రీంకోర్టులో బలమైన వాదనలను రాష్ట్ర ప్రభుత్వం తరపున గతంలో వినిపించలేక పోయారు. అంతకుముందు ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు, ప్రజలకు నష్టం కలిగించే అంశాలైనప్పటికీ రాజధాని, ఇతరత్రా అంశాల్లో కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని వినియోగించి నిష్ణాతులైన లాయర్లను వినియోగించారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో కక్షపూరితంగా జగన్ ప్రభుత్వం ఎందుకు వ్యవహరిస్తోందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది'' అని నిలదీశారు. 

''సుమారు 26 ఏళ్లుగా స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల వారు, మహిళలు తెలుగుదేశం పార్టీ వల్ల అవకాశాలు పొందారు. 1994లో పంచాయతీరాజ్ చట్టం సవరించిన తర్వాత 34 శాతం రిజర్వేషన్లను బీసీలు పొందుతున్నారు. 1987 నుంచి స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉండటం వల్లే వేలాది మంది క్షేత్రస్థాయిలో వెనుకబడిన తరగతుల వారు నాయకులుగా ఎదగగలిగారు. తదనంతర కాలంలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా రాణించగలిగారు. ఇవాళ రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతం తగ్గడం వల్ల 16వేల పదవులు బీసీలు కోల్పోతున్నారు. బీసీలకు వైసీపీ ప్రభుత్వం ఏ రకమైన న్యాయం చేస్తోంది'' అని అడిగారు. 

read more  తెలంగాణ ప్రభుత్వంతో కలిసే పనిచేస్తాం: పోతిరెడ్డిపాడుపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

''34 శాతం రిజర్వేషన్లను పరిరక్షించడానికి ఇప్పటికీ అవకాశం ఉంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం కావడం వల్ల కేంద్రం నుంచి నిధులు రాలేకపోతున్నాయని, అందుకే త్వరగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని వైసీపీ ప్రభుత్వ పెద్దలు చెప్పారు. ఇప్పుడు బకాయిలు వచ్చాయి. ఎన్నికలతో సంబంధం లేకుండా కేంద్రం నిధులు ఇచ్చింది. పాత బకాయిలను కూడా విడుదల చేసింది. ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే వాతావరణం కూడా లేదు. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను పరిరక్షించేందుకు సత్వరం కొత్త ఆర్డినెన్స్ విడుదల చేయాలి. ఆ ఆర్డినెన్స్ పై ఎవరైనా కోర్టుకు వెళితే సమర్థవంతమైన లాయర్లను పెట్టి బలమైన వాదనలు వినిపించాలి'' అని సూచించారు.

''2010లో 60.55 రిజర్వేషన్ల శాతాన్ని పరిరక్షించుకోగలిగాం. అలాంటి పరిరక్షణ ఇప్పుడు కూడా జరగాల్సిన అవసరం ఉంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు లేకపోతే వెనుకబడిన తరగతుల వారు బలమైన వర్గాలతో పోటీపడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ సందర్భంలో బీసీల రిజర్వేషన్లను పరిరక్షించుకోవడానికి ప్రభుత్వానికి కలిగిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బీసీల పట్ల వైసీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే జగన కు చెప్పాలి'' అని అన్నారు. 

''కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో పాఠశాలలు, ప్రజారవాణ స్తంభించిపోయాయి. అలాంటప్పుడు ఈ రెండు మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించే అవకాశం లేదు. ఈ సందర్భంలో 34 శాతం రిజర్వేషన్లను పరిరక్షించడానికి ప్రభుత్వానికి కలిగిన అవకాశాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు. ప్రభుత్వం ఆలోచన చేయాలి'' అని సూచించారు.

read more  వరుసగా ఐదు రోజులు, ఐదు శాఖలు... ఏడాది పాలనపై సిఎం జగన్ మేధో మదనం

''తమిళనాడులో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. మన రాష్ట్రంలో 48శాతం బీసీ జనాభా ఉందని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. వీరికి 34శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సహేతుకం. దానికి చట్టబద్ధత తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి. ఇప్పటికైనా జగన్ బీసీలకు 34శాతం రిజర్వేషన్లను పరిరక్షిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి'' అని డిమాండ్ చేశారు. 

''న్యాయస్థానంలో బలమైన వాదనలను వినిపించి చట్టబద్ధత కల్పించి బీసీల హక్కుల్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. బీసీ ప్రజా ప్రతినిధులు దీనిపై ఆలోచన చేయాలి. ఐక్య పోరాటాలకు ముందుకు రావాలి. బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వినియోగించడం మానుకోవాలి'' అంటూ వైసిపి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్ ను కాలవ విమర్శించారు.