వివేకా కేసు.. పక్షపాతంతోనే రామ్ సింగ్ దర్యాప్తు, నాకు న్యాయం చేయండి : సీబీఐ డైరెక్టర్‌కు అవినాష్ రెడ్డి లేఖ
కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాష్ రెడ్డి ఆదివారం సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు లేఖ రాశారు. గతంలో వివేకా కేసును దర్యాప్తు చేసిన సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై ఆయన ఫిర్యాదు చేశారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం బయటకు రావడంతో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. బాబాయ్ హత్యకు రాజకీయ పరమైన అంశాలే కారణమంటూ షర్మిల అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాష్ రెడ్డి ఆదివారం సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు లేఖ రాశారు. గతంలో వివేకా కేసును దర్యాప్తు చేసిన సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై ఆయన ఫిర్యాదు చేశారు. రామ్‌సింగ్ ఈ కేసును పక్షపాత వైఖరితో దర్యాప్తు చేశారని అవినాష్ రెడ్డి ఆరోపించారు. రామ్‌సింగ్ చేసిన దర్యాప్తును పున: సమీక్షించాలని ఆయన సీబీఐ డైరెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.
ALso Read: కోల్డ్ వార్ ఉండేది.. వివేకా హత్యకు రాజకీయపరమైన కారణాలు!: వైఎస్ షర్మిల వాంగ్మూలంలో కీలక వ్యాఖ్యలు
సీబీఐ దాఖలు చేసిన రెండు ఛార్జ్‌షీట్ల ఆధారంగా లేఖ రాశారు అవినాష్ రెడ్డి. వివేకా రెండో వివాహం , బెంగళూరు ల్యాండ్ సెటిల్ మెంట్ అంశాలు లేఖలో కడప ఎంపీ ప్రస్తావించారు. దస్తగిరి నిలకడలేని సమాధానాల ఆధారంగా రామ్ సింగ్ విచారణ జరిపారని అవినాష్ రెడ్డి ఆరోపించారు. రెండో భార్య పేరిట వున్న ఆస్తిపత్రాలను ఎత్తుకెళ్లడానికే హత్య చేసి వుండొచ్చన్న కోణంలో విచారణ జరగలేదని ఎంపీ పేర్కొన్నారు. మున్నా లాకర్‌లో నగదుకు సంబంధించిన వివరాలు సీబీఐకి ఎవరు చప్పారని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. విచారణలో రామ్ సింగ్ చేసిన తప్పులను సవరించాలని ఆయన కోరారు. అలాగే నిజమైన నేరస్తులను పట్టుకుని న్యాయం చేయాలని అవినాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.