ఆడకూతురని.. మానవత్వంతో లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఓ యువతి.. యువకుడిని నిలువునా ముంచేసింది. వివరాల్లోకి వెళితే... కడపకు చెందిన  శివ అనే యువకుడు ఈ నెల 17న తన ద్విచక్ర వాహనంపై పనిమీద రిమ్స్‌కు వెళుతున్నాడు.

అయితే మార్గమధ్యంలో కలసపాడు మండలం ఎగువ రామాపురానికి చెందిన బసిరెడ్డి లీలావతి అనే యువతి అతని బైక్‌ను ఆపింది. రిమ్స్‌లో తమ బంధువులు చేరారని.. అత్యవసరంగా వెళ్లాలని చెప్పి లిఫ్ట్ అడిగింది.

దీంతో అతను మానవత్వంతో ఆమెను బైక్ ఎక్కించుకుని రిమ్స్‌కు బయలుదేరాడు. రిమ్స్‌లోని దంతవైద్య కళాశాల వద్దకు వెళ్లగానే అతనికి ఫోన్ రావడంతో బైక్‌ను ఆపి ఫోన్‌ మాట్లాడేందుకు పక్కకు వెళ్లాడు.

ఇదే అదనుగా భావించిన లీలావతి ఆ బైక్‌ను స్టార్ట్‌ చేసుకుని వేగంగా ఉడాయించింది. వెంటనే తేరుకున్న శివ... ఆమె పట్టుకోవాలనుకున్నప్పటికీ వల్లకాలేదు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లీలావతి వివరాలు తెలుసుకుని.. శనివారం సాయంత్రం కడపలో అరెస్ట్ చేశారు.