కడప: సీఎం జగన్ ఇలాఖాలో తమ సత్తా ఏంటో నిరూపిస్తానంటూ బయలుదేరిన టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు చుక్కలు చూపించారు తెలుగు తమ్ముళ్లు. చంద్రబాబు ఎదుటే ముష్టియుద్ధానికి దిగడంతో అంతా అవాక్కయ్యారు. 

కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతం, టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో వారికి అండగా ఉన్నామన్న భరోసా ఇవ్వడంతోపాటు కార్యకర్తల్లో నూతనొత్సాహం నింపేందుకు చంద్రబాబు కడప జిల్లా పర్యటనకు బయలు దేరారు. 

ఈనెల 25 నుంచి 27 వరకు అంటే మూడు రోజులపాటు కడపలోనే మకాం వేయనున్నారు చంద్రబాబు. మెుదటి రోజు కడప నియోజకవర్గ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, తెలుగు తమ్ముళ్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. 

మీ సమస్యలు చెప్పాలంటూ కార్యకర్తలకు చంద్రబాబునాయుడు ఆదేశించారు. మైకు అందుకున్న టీడీపీ కార్యకర్త తన అసహనం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డిపై ఉన్న అక్కసును అంతా బయటపెట్టారు. 

జిల్లా నాయకత్వంపై తన అసంతృప్తిని చంద్రబాబు ఎదుట కుండబద్దలు కొట్టారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డిపై ఫిర్యాదు చేయడంతో ఆయన అనుచరులు అతని మైకు లాక్కునే ప్రయత్నం చేశారు. 

నియోజకవర్గంలో వాస్తవాలు తెలియజేస్తే అడ్డుకుంటారా అంటూ టీడీపీ కార్యకర్త వాదించాడు. అధికారంలో ఉన్నప్పుడు తమను జిల్లా నాయకత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. దళితులు అయినందుకే తమను చిన్న చూపు చూశారంటూ చంద్రబాబు ఎదుట వాపోయారు. 

దాంతో రెచ్చిపోయిన జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి అనుచరులు టీడీపీ కార్యకర్తపై దాడికి దిగారు. చంద్రబాబు నాయుడు వారిస్తున్నా వినకుండా ఆగ్రహంతో దళిత టీడీపీ నేతపై పిడిగుద్దులు గుప్పించారు.  

కడప జిల్లాలో పర్యటించి కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపేందుకు వచ్చిన చంద్రబాబుకు కడప నియోజకవర్గం సమీక్షలో తెలుగు తమ్ముళ్లు ఊహించని షాక్ ఇచ్చారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దుల దాడికి దిగడంతో చంద్రబాబు నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. 

ఈనెల 27తో కడప జిల్లాలో చంద్రబాబు పర్యటన ముగియనుంది. అనంతరం 28న నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు చంద్రబాబు నాయుడు. రాజధాని ప్రాంతంపై నెలకొన్న నీలినీడలు, వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలని చంద్రబాబు ఆ పర్యటన ద్వారా ప్రయత్నించే అవకాశం ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ ఇలాఖాలోనే ఇదీ పరిస్థితి...మంచి సీఎం అంటే ఇదేనా...?: చంద్రబాబు