ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆమరణదీక్ష చేస్తున్న ప్రవీణ్ విద్యార్థుల దిగ్బంధంతో ప్రొద్దుటూరు లో స్తంభించిన ట్రాఫిక్ వేదిక వద్దకు తరలివస్తున్న విద్యార్థిలోకం
కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని స్టీల్ ప్లాంట్ సాధన సమితి అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి గత నాలుగు రోజులుగా ప్రొద్దుటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అయినా ప్రభుత్వం ఇప్పటి వరకు ఆయన దీక్ష పై స్పందించడం లేదు.
మరో వైపు నిరహార దీక్షతో ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తోంది. ఉదయం ఆయనను పరీక్షించిన వైద్యులు శరీరంలో షుగర్ లెవల్స్ పడిపోయాయని తెలిపారు. అయినా దీక్ష విరమించేది లేదని ప్రవీణ్ తేల్చి చెప్పారు.
కాగా, ప్రవీణ్ కుమార్ రెడ్డి దీక్షకు అన్నివైపుల నుంచి మద్ధతు లభిస్తూ ఉంది. ముఖ్యంగా విద్యార్థి లోకం ఆయన దీక్షకు మద్దతుగా తరలివస్తోంది. దీంతో ప్రొద్దుటూరులో భారీగా ట్రాఫిక్ స్తంభిస్తోంది.
కడప జిల్లా నుంచే కాకుండా పక్కనున్న అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా యువకులు, జనవిజ్ఞాన వేదిక సభ్యులు ప్రదర్శనలు నిర్వహిస్తూ ప్రవీణ్ కుమార్ రెడ్డి దీక్షకు మద్దతు ప్రకటిస్తున్నారు.
విద్యార్థిలోకమంతా ఆయన దీక్ష శిబిరం వద్దే ఉండటంతో ఎలాంటి ఉద్రికత్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులను పెద్దయెత్తున మోహరించారు.
