Asianet News TeluguAsianet News Telugu

కడప ఉక్కు ఫ్యాక్టరీని అడ్డుకుంది టీడీపీనే: పవన్ కల్యాణ్

కడప ఉక్కు కర్మాగారాన్ని అడ్డుకున్నది తెలుగుదేశం పార్టీయేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు.

Kadapa steel factory was obstructed by TDP: Pawan

అమరావతి: కడప ఉక్కు కర్మాగారాన్ని అడ్డుకున్నది తెలుగుదేశం పార్టీయేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. ఇప్పుడు ఆ పార్టీయే గోల చేస్తోందని ఆయన అన్నారు. ఉక్కు పరిశ్రమ స్థాపనకు తాము సిద్ధమని జిందాల్‌ సంస్థ చెప్పిందని ఆయన గుర్తు చేసారు.

కడప ఉక్కు కర్మాగారం కోసం ఈ నెల 29న తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. రాష్ట్ర బంద్ కు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. 

సెప్టెంబరులో జనసేన, వామపక్షాలు, లోక్‌సత్తా పార్టీలు కలసి భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తాయని పవన్ చెప్పారు. వామపక్షాలదీ, తమదీ ఒకే ఆలోచన, ఒకే భావజాలమని చెప్పారు. మూడు నెలల్లో వామపక్షాలు, జనసేన కలసి ఉమ్మడి రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తాయని చెప్పారు. 

విజయవాడలో ఆదివారం ఆయనతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఆ తర్వాత రామకృష్ణతో కలిసి పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు.
 
రాష్ట్రంలో పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. రాష్ట్రంలో క్లీన్‌ గవర్నెన్స్‌ వస్తుందనీ 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతును ఇచ్చానని ఆయన చెప్పారు. అది జరగకపోవడం వల్లే తాను టీడీపీ దూరమైనట్లు తెలిపారు.  రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలంటే కమీషన్లు అడుగుతున్నారని విదేశాల్లో తనకు పారిశ్రామికవేత్తలు చెప్పారని అన్నారు.  
2019  ఎన్నికల్లో జగన్‌ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టేనని సీపీఐ నేత రామకృష్ణ వ్యాఖ్యానించారు.

Follow Us:
Download App:
  • android
  • ios