కడప: ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ వ్యవహారం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బదిలీ వ్యవహారంపై శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిరాధార ఆరోపణలు చేశారంటూ శ్రీకాకుళం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే సిఈవో గోపాల కృష్ణద్వివేదికి కూడా లేఖ రాశారు. 

మరోవైపు బదిలీ వ్యవహారంపై కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ స్పందించారు. తనపై ఎలాంటి విచారణ జరపకుండా బదిలీ చెయ్యడం సరికాదంటూ సిఈవో గోపాలకృష్ణ ద్వివేదికి లేఖ రాశారు. 

ఫిబ్రవరి 18న తాను కడప ఎస్పీగా తాను బాధ్యతలు చేపట్టానని, అప్పటినుంచి జిల్లాలో పర్యటిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నానని లేఖలో వెల్లడించారు. 

మంగళవారం రాత్రి తనను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించారు. విచారణలో తప్పు ఉందని తేలితే తనపై ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని, లేనిపక్షంలో తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ రాశారు.

మరోవైపు ఐపీఎస్ అధికారుల బదిలీల వ్యహారంపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. హై కోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ ను దాఖలు చేసింది. ఈ పిటీషన్ పై గురువారం హైకోర్టులో వాదనలు వినిపించనుంది. 

మరోవైపు ఈసీ సైతం తమ వాదనలు వినిపించేందుకు రెడీ అయింది. ఇలాంటి తరుణంలో శ్రీకాకుళం ఎస్పీ వెంకట రత్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చెయ్యడంతోపాటు, ఈసీకి లేఖ రాయడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.      

ఈ వార్తలు కూడా చదవండి

ఏపీలో ముదురుతున్న ఐపీఎస్ అధికారుల బదిలీలు: విజయసాయిరెడ్డిపై ఎస్పీ ఫిర్యాదు