అమరావతి: ఏపీలో ఐపీఎస్ అధికారులు బదిలీల వ్యవహారం దుమారం రేపుతోంది. తమపై నిధార ఆరోపణలు చేశారంటూ శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిరాధార ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ శ్రీకాకుళం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 

ఆరోపణలపై నిగ్గుతేల్చాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే త్వరలో వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై పరువునష్టం దావా కూడా వేస్తానని హెచ్చరించారు. అలాగే అంతకు ముందు ఈసీకి లేఖ రాశారు ఎస్పీ వెంకటరత్నం. 

విజయసాయిరెడ్డి తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది కి లేఖ రాశారు. వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి విచారణ చెయ్యకుండా 24 గంటల్లో చర్యలు తీసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

విజయ సాయిరెడ్డి తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని సాక్ష్యాలతో సహా లేఖలో పొందుపరిచారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలి లేదా ఆరోపణలు చేసిన వారిపై చర్య తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. 

ఎంత స్పీడ్ గా విజయసాయిరెడ్డి ఆరోపణలపై స్పందించారో అంతే వేగంగా స్పందించి తాను దోషినా లేక నిర్దోషినా అన్నది తేల్చాలంటూ డిమాండ్ చేశారు. ఎస్ఐ స్థాయి నుంచి ముప్పై ఏళ్ళు కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పుకొచ్చారు. 

టీడీపీ నేత రాజాం టీడీపీ అభ్యర్థికి సంబంధించి నగదును పట్టుకున్నా కూడా అతనికి తిరిగి అందజేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. తాను ఆసమయంలో ఆఫీస్ లోనే ఉన్నానని అలాంటిది ఏమీ జరగలేదన్నారు. 

మరోవైపు ఐపీఎస్ అధికారుల బదిలీల వ్యహారంపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. హై కోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ ను దాఖలు చేసింది. ఈ పిటీషన్ పై గురువారం హైకోర్టులో వాదనలు వినిపించనుంది. 

మరోవైపు ఈసీ సైతం తమ వాదనలు వినిపించేందుకు రెడీ అయింది. ఇలాంటి తరుణంలో శ్రీకాకుళం ఎస్పీ వెంకట రత్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చెయ్యడంతోపాటు, ఈసీకి లేఖ రాయడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.