కడప స్మగ్లర్ భాషా భాయ్ గ్యాంగ్‌పై విచారణ కొనసాగుతోంది. డీటీసీ కేంద్రంగా సుధీర్ఘంగా విచారణ సాగుతోంది. భాషా భాయ్‌తో పాటు ఐదుగురు అనుచరులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

భాషాకు సహకరించిన లోకల్ గ్యాంగులను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక ఇతర రాష్ట్రాలకు చెందిన గ్యాంగుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ సజీవ దహనం ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ భాషా పన్నాగంతోనే ఐదుగురు తమిళ కూలీల ముఠా దుర్మరణం పాలైనట్లు పోలీసుల విచారణలో తేలింది.

భాషా భాయ్ ఆదేశాలతోనే కడపకు చెందిన లోకల్ హైజాక్ గ్యాంగ్ తమిళ కూలీల స్మగ్లర్ల వాహనాన్ని వెంటాడినట్లుగా పోలీసులు దర్యాప్తులో తేలింది. బెంగళూరు కేంద్రంగా భాషా భాయ్ ఎర్రచందనం స్మగ్లింగ్ సాగిస్తున్నాడు.

స్మగ్లర్ భాషా సూచనలతో వారం క్రితం తమిళనాడు నుంచి ఎనిమిది మంది కూలీలు సిద్ధవటం మండలం భాకారావుపేట అడవుల్లోకి ప్రవేశించారు. తమిళ ముఠాతో 25 లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు భాషా.

అయితే అంత భారీ మొత్తాన్ని కూలీలకు ఇవ్వడానికి మనసొప్పని అతను.. పది లక్షల రూపాయలు ఆశ చూపి కడప లోకల్ హైజాక్ గ్యాంగ్‌తో మరో డీల్ కుదుర్చుకున్నాడు.

ప్రమాద ఘటన, ఆ తర్వాత పరిణామాల్లో భిన్నమైన కోణాలు వెలుగు చూడటంతో పోలీసులు యంత్రాంగం అప్రమత్తమైంది.

ఇతర ప్రాంతాల్లో ఉన్న స్మగ్లింగ్ గ్యాంగులపై కూడా నిఘా పెంచింది. భాషాకి సహకరిస్తున్న స్థానిక రాజకీయ నేతలపై కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు.