వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో సీబీఐ కీల‌క విష‌యాలను రాబ‌డుతోన్న నేప‌థ్యంలో తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయ‌న‌ కుమార్తె సునీత కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. 

దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత ఇంటి వద్ద రెక్కీ నిర్వహించడంతో పాటు ఆమె బెదిరించిన వ్యక్తిని కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితుడు మ‌ణికంఠ రెడ్డిని అదుపులోకి తీసుకున్నామ‌ని పోలీసులు వెల్లడించారు. అత‌డిని డీఎస్పీ శ్రీ‌నివాసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది.. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి వుంది. 

కాగా, తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, వెంటనే భద్రత కల్పించాలని కోరుతూ దివంగత వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత రాసిన లేఖపై కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ స్పందించారు. సునీత ఇంటి వద్ద వెంటనే పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే సునీత లేఖలో పేర్కొన్న ఇతర అంశాలపైనా విచారణ చేయాలని ఎస్పీ అన్బురాజన్ ఆదేశించారు. విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ స్థాయి అధికారికి సూచించారు. 

ALso Read:వివేకా కుమార్తె లేఖ, స్పందించిన కడప ఎస్పీ.. సునీత ఇంటి వద్ద పోలీస్ భద్రత

అంతకుముందు తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కడప ఎస్పీ అన్బురాజన్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత లేఖ రాశారు.ఈ నెల 10వ తేదీన పులివెందులలోని తమ నివాసం వద్ద మణికంఠరెడ్డి అనే వ్యక్తి రెక్కీ నిర్వహించాడని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. తన తండ్రి హత్య కేసులో శివశంకర్ రెడ్డి అనుమానితుడిగా ఉన్నాడన్నారు. ఆయన అనుచరుడు మణికంఠరెడ్డి తమ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించడం అనుమానాలకు తావిస్తోందన్నారు.