ధైర్యంగా ఎదుర్కొంటాం: భాస్కర్ రెడ్డి అరెస్ట్ పై సీబీఐ, సునీతలపై అవినాష్ రెడ్డి ఫైర్

వైఎస్ వివేకానందరెడ్డి  హత్య కేసులో  వ్యక్తులు లక్ష్యంగా  సీబీఐ  విచారణ  జరుగుతుందని  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  ఆరోపించారు.  వైఎస్ భాస్కర్ రెడ్డి  అరెస్ట్ పై మాటలు రావడం లేదన్నారు

Kadapa  MP  YS Avinash  Reddy  Respond  On  YS Bhaskar Reddy  Arrest  lns

పులివెందుల: వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసులో  వాస్తవాల ఆధారంగా కాకుండా  వ్యక్తుల ఆధారంగా  సీబీఐ  విచారణ  నిర్వహిస్తుందని  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  ఆరోపించారు. 

ఆదివారంనాడు  పులివెందులలో  కడప  ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  
వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్  చేయడంతో  మాటలు  రావడం లేదన్నారు.  కీలకమైన అంశాలను  సీబీఐ విస్మరిస్తుందని ఆయన  విమర్శించారు.   సిల్లీ విషయాలను  సీరియస్ గా  తీసుకొని  సీబీఐ  విచారిస్తుందని అవినాష్ రెడ్డి  ఆరోపించారు. గతంలో  విచారణ  నిర్వహించిన   అధికారి తరహలోనే  కొత్త  సీబీఐ బృందం  విచారణ  నిర్వహిస్తుందని  ఆయన  ఆరోపించారు.  ధైర్యం కోల్పోకుండా  తమ నిజాయితీని  నిరూపించుకుంటామన్నారు. 

 ఏప్రిల్  3న  తాము  అధికారులకు  ఇచ్చిన   అభ్యంతరాలను  సీబీఐ  పట్టించుకోవడం లేదన్నారు.   వివేకానందరెడ్డి  హత్య  విషయాన్ని  పోలీసులకు  చెప్పింది తానేనని  ఆయన  చెప్పారు.ఘటనాస్థలికి  రావాలని  పోలీసులను  మూడు సార్లు కోరినట్టుగా  వైఎస్ అవినాష్ రెడ్డి  చెప్పారు. 

తన కంటే  ముందే  వైఎస్ వివేకానందరెడ్డి హత్య  విషయం   ఆయన అల్లుడు  రాజశేఖర్ రెడ్డికి తెలుసునని  చెప్పారు.  వైఎస్  వివేకానందరెడ్డి  ఇంట్లో దొరికిన లేఖను దాచిపెట్టాలని  రాజశేఖర్ రెడ్డి  చెప్పారని  అవినాష్ రెడ్డి  ఆరోపించారు.  వివేకా హత్య  కేసులో సమాచారం దాచి పెట్టిన  అల్లుడు రాజశేఖర్ రెడ్డిని సీబీఐ విచారించడం లేదన్నారు.  కానీ తమను విచారించడంలో ఆంతర్యం ఏమిటని  ఆయన  ప్రశ్నించారు.  

వైఎస్ వివేకానందరెడ్డి  2010లో  షేక్ మహ్మద్ అక్బర్ గా  పేరు మార్చుకున్నాడన్నారు.  అంతేకాదు ముస్లిం  మహిళను వివేకానందరెడ్డి  వివాహం  చేసుకున్నాడన్నారు. వీరికి  ఓ కొడుకు  కూడా ఉన్నాడన్నారు. తన  ఆస్తిని  రెండోభార్య పేరు మీద రాయాలని  వివేకానందరెడ్డి భావించారని  వైఎస్ అవినాష్ రెడ్డి  చెప్పారు. ఆస్తి  కోసం  వివేకానందరెడ్డి  హత్య  జరిగి ఉండొవచ్చని  ఆయన  ఆరోపించారు.  వివేకా హత్య  జరిగిన  రోజున కీలకమైన డాక్యుమెంట్లను  సీబీఐ ఎందుకు  స్వాధీనం  చేసుకోలేదో  చెప్పాలన్నారు.

హత్య  సమయంలో వివేకానందరెడ్డి రాసిన లేఖను సీబీఐ  పట్టించుకోవడం లేదని  వైఎస్ అవినాష్ రెడ్డి  చెప్పారు.  వివేకా హత్య కేసులో  తమను  దోషులుగా  చూపించే ప్రయత్నం  చేస్తున్నారని  వైఎస్ అవినాష్ రెడ్డి  పేర్కొన్నారు.  వాస్తవాల ఆధారంగా విచారణ జరగాలని  అవినాష్ రెడ్డి  కోరారు. వ్యక్తులు  లక్ష్యంగా  విచారణ  జరగడం సరైంది కాదని ఆయన  అభిప్రాయపడ్డారు. సీబీఐకి అఫ్రూవర్ గా మారిన దస్తగిరి  ఇచ్చిన స్టేట్ మెంట్ ను  కూడా  సీబీఐ పట్టించుకోవడం లేదని అవినాష్  రెడ్డి  ఆవేదన  వ్యక్తం  చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి  వాచ్ మెన్  రంగన్న మాటలను కూడా  సీబీఐ పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. సీబీఐ ఈ స్థాయికి  దిగజారడం  విచారకరమన్నారు.  ఈ కేసు విచారణలో  అధికారుల తీరును  సీబీఐ ఉన్నతాధికారులకు  కూడా  తెలియజేసినట్టుగా  అవినాష్ రెడ్డి  గుర్తు  చేశారు. 

also read:వైఎస్ వివేకా హత్య కేసు: ఉస్మానియాలో వైఎస్ భాస్కర్ రెడ్డికి వైద్య పరీక్షలు

వైఎస్ సునీతారెడ్డి , సీబీఐ  ఒకే లక్ష్యంతో వ్యవహరిస్తున్నారన్నారు. వైఎస్ సునీత చంద్రబాబుతో  చేతులు కలిపారని ఆయన  ఆరోపించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య  జరిగిన  ఏడాది వరకు  సునీతమ్మ తనతో బాగానే మాట్లాడేదని  ఆయన  చెప్పారు. ఆ తర్వాతే  సునీతారెడ్డి  మాటలు మారాయన్నారు. ఆమె వెర్షన్ ఎందుకు  మారిందో అర్ధం  కావడం లేదన్నారు. ఢిల్లీకి వెళ్లి ఆమె మీడియా సమావేశం పెట్టారన్నారు.  టీడీపీ నేతలు మాట్లాడిన తరహలో  సునీతారెడ్డి విమర్శలు చేశారన్నారు. చంద్రబాబుతో  సునీతారెడ్డి  చేతులు  కలిపారని  ఆయన  ఆరోపించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios