విజయవాడ: తెలుగుదేశం పార్టీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి పేరును భారతరత్న అవార్డుల ఎంపిక నామినేషన్ పంపకపోవడంపై ఆయన మండిపడ్డారు. 

బాలయోగి విషయంలో తెలుగుదేశం పార్టీ దారుణంగ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన కేఏ పాల్ జీఎంసీ బాలయోగి దళితుడు కాబట్టే నామినేషన్ కు పంపలేదన్నారు. నీతి నిజాయితీలకు మారుపేరు అయిన బాలయోగికి భారతరత్న ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. 

ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ఇవ్వడం భారతదేశ చరిత్రలో చీకటి రోజని విమర్శించారు. ఈ రోజు దుర్దినం అన్నారు. ప్రణబ్ ముఖర్జీ తప్పుడు విధానంలో రాష్ట్రపతి అయ్యారని పాల్ ఆరోపించారు. ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ నాయకుడు భగవత్ తో కలవడం వల్లే భారతరత్న ఇచ్చారని ఆరోపించారు. 

బ్రహ్మాణుడు కావడం వల్లే ఆయనకు భారతరత్న ఇచ్చారని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ సమ్మిట్ లకు వెళ్లడం వల్లే భగవత్ భారతరత్న ఇప్పించారని విమర్శించారు. బీజేపీకి బద్ద వ్యతిరేకి అయిన ప్రణబ్ ముఖర్జీకి ఎలా భారతరత్న వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. 

ప్రజాస్వామ్యం గెలవాలంటే ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ కార్యకలాపాలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు. ప్రణబ్ ముఖర్జీ తనకు తెలుసనన్నారు. ఆయన శాంతికి విరుద్ధంగా పనిచేశారు కాబట్టే తాను అతనిని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. 

ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ఇవ్వడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉండటం బాధాకరమన్నారు. ఎంతో  పవిత్రమైన భారతరత్న పథకాన్ని ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చి అపహాస్యం చేశారని కేఏ పాల్ విమర్శించారు. గతంలో తాము గ్లోబల్ పీస్ మిషన్ సంస్థ తరుపున అమెరికాలో క్రిమినల్ కేస్ వేశామని గుర్తు చేశారు. 

అమెరికా నుండి వచ్చి ఆయనకు సమన్లు కూడా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. చాలా క్రిమినల్ కేసులు ఎదుర్కొన్న వ్యకతికి ఎలా భారతరత్న ఇస్తారని నిలదీశారు. లోక్ సభలో మెజారిటీ ఉంది అని ఎవరికి పడితే వారికి అవార్డు ప్రధానం చేస్తారా ? అని ప్రశ్నించారు. 


ప్రపంచ శాంతి కోసం పాటుపడుతూ, లోక్ సభ స్పీకర్ గా సేవాలందించిన బలయోగికి అవార్డు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. 2004 లో ప్రణబ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్న గ్లోబల్ పీస్ సంస్థను అడ్డుకున్నారని కేఏ పాల్ ఆరోపించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

పెద్ద ప్లాన్ ఇదే: జగన్ పై కెఎ పాల్ ఆస్త్రం, బాబుకు ప్లస్