Asianet News TeluguAsianet News Telugu

పెద్ద ప్లాన్ ఇదే: జగన్ పై కెఎ పాల్ ఆస్త్రం, బాబుకు ప్లస్

కేఏ పాల్ ఏపీ రాజకీయాల్లోకి రావడం వెనుక పెద్ద ప్లాన్ ఉందని ప్రచారం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి ఓట్లను చీల్చేందుకు కేఏ పాల్ ఎన్నికలంటూ నానా హడావిడి చేస్తున్నారంటూ చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఏపీలో క్రైస్తవ సోదరుల ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయని ప్రచారం. 

KA Paul may play anti YS Jagan role to help Chandrababu
Author
Hyderabad, First Published Jan 26, 2019, 12:14 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికల్లో నాకో అవకాశం ఇవ్వండి. అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తా. ఏడు కోట్ల కోట్ల నిధులను రాష్ట్రానికి తీసుకువస్తా. మూడు లక్షల కోట్లతో రైతు రుణమాఫీ చేస్తా. మిగిలిన డబ్బులతో ఇక అభివృద్ధే అభివృద్ధి. రాష్ట్రంలో 64 లక్షల మంది సభ్యులు ఉన్నారు. 

త్వరలో మూడు కోట్ల మంది సభ్యత్వం పొందుతారు. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు సీఎం కారు, జగన్ సీఎం కావడం కల్ల, పవన్ కళ్యాణ్ సెట్ అవ్వడు. నాకు మాత్రమే అవకాశం ఉంది. నన్ను నమ్ముకుని నా పార్టీలోకి వస్తే ఇక మీ రాత మారిపోతుంది. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఇంతలా ప్రభావితం చేసే నాయకుడు ఎవరా అనుకుంటున్నారా.. చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ లను తలదన్నేలా ఉన్న ఆ నాయకుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా.. ఇంకా అర్థం కాలేదా...

 ప్రపంచంలో ఎంతోమందిని ప్రధానిలను చేశాను, దేశంలో ఐదుగరు ముఖ్యమంత్రులను చేశాను అది తన సత్తా అని చెప్పుకుంటారు ఇప్పుడు అర్థమైందనుకుంటా. మీరనుకున్నది కరెక్టే ఇంకెవరు కేఏ పాల్. 

క్రైస్తవ మత ప్రబోధకుడిగా ప్రపంచ వ్యాప్తంగా పేర్గాంచిన కేఏ పాల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజాశాంతి పార్టీని స్థాపించారు. అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రసవత్తరంగా సాగబోతున్న తరుణంలో తాను కూడా ఏపీ ఎన్నికల సమరంలో ఉన్నానంటూ చెప్పుకొస్తున్నారు.  

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అవినీతిమయమైపోయాయని తాను మాత్రం నీతివంతమైన పాలన అందిస్తానని చెప్పుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక్కరే బరిలో దిగితే ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేరని తనని నమ్ముకుంటే సీఎం అయిపోవచ్చని ఆఫర్లు ఇస్తున్నారు. 

వంగవీటి రాధాను సైతం ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ప్రజాశాంతి పార్టీ తరుపున పోటీ చెయ్యాలని ఒకవేళ ఓడిపోతే రూ.100కోట్లు ఇస్తానని బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఈయన గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. 

అధికార ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు చెరుగుతున్నారు. మాట్లాడితే కోట్లు విసిరేస్తానంటూ హామీలిస్తున్నారు. తనను గెలిపిస్తే రాష్ట్రానికి ఏడు కోట్ల కోట్ల నిధులు తీసుకువస్తానని ఆంధ్రప్రదశ్ రాష్ట్రాన్ని మరో అమెరికా చేస్తానంటూ సాధ్యం కాని హామీలిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.  

అయితే కేఏ పాల్ ఏపీ రాజకీయాల్లోకి రావడం వెనుక పెద్ద ప్లాన్ ఉందని ప్రచారం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి ఓట్లను చీల్చేందుకు కేఏ పాల్ ఎన్నికలంటూ నానా హడావిడి చేస్తున్నారంటూ చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఏపీలో క్రైస్తవ సోదరుల ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయని ప్రచారం. 

వైఎస్ జగన్ కుటుంబం క్రైస్తత్వం స్వీకరించడంతోపాటు ఆయన బావ బ్రదర్ అనిల్ కుమార్ మత ప్రబోధకుడు. ఈ నేపథ్యంలో క్రైస్తవసోదరుల ఓట్లన్నీ వైసీపీకి పడతాయని ఏపీలో చర్చించుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో వైసీపీకి వచ్చే ఆ ఓట్లను కొల్లగొట్టేందుకే కే ఏ పాల్ రంగంలోకి దిగారని వైసీపీ ఆరోపిస్తుంది. 

కేఏ పాల్ రాజకీయ హైడ్రామా వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారంటూ పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అటు కేఏ పాల్ తాను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినని చెప్పుకుంటూనే దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని ప్రచారం చేసుకుంటున్నారు. 

అంటే క్రైస్తవ ఓట్లతోపాటు దళితసామాజిక వర్గం ఓట్లను కూడా చీల్చాలని కేఏ పాల్ ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు తనను దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని 50సార్లు అరెస్ట్ చేశారని చెప్పుకొస్తున్నారు. 

తాను చెప్పినట్లే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాడని, కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయ్యిందని, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతైందని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబునాయుడుపై దేవుడు ఆగ్రహంగా ఉన్నారంటూ చెప్పుకొస్తున్నారు. 

అయితే కేఏ పాల్ రాజకీయం చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్ ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న చంద్రబాబు నాయుడికి అనుకోని ఆయుధంలా కేఏ పాల్ దిరికారంటూ చర్చ జరుగుతోంది.  

Follow Us:
Download App:
  • android
  • ios