కరోనా సెకండ్‌వేవ్ విజృంభిస్తోన్న వేళ రాష్ట్రంలో పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణ సరికాదన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, మత ప్రబోధకుడు కేఏ పాల్‌ అన్నారు. పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ... ఆయన గురువారం విశాఖలోని కన్వెన్షన్ భవనంలో నిరసన దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ... విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని పరీక్షలు వాయిదా వేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకునే వరకు దీక్ష కొనసాగిస్తానని పాల్‌ హెచ్చరించారు.

పరీక్షలను రద్దు చేసే అంశంపై తాను వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టులో అడ్మిట్‌ చేశారు. రేపే వాదనలు జరుగుతాయని ఆయన ఆకాంక్షించారు. 35 లక్షల మంది విద్యార్థులకు మేలు జరిగే వరకు తాను దీక్ష చేస్తానని వెల్లడించారు.

తన పిల్లల్ని పరీక్షలకు పంపడం లేదని, పరీక్షలు రద్దు చేయమని, పాస్‌ చేయమని అడగట్లేదన్నారు. కేవలం రెండు నెలలు వాయిదా వేయమని తాను కోరుతున్నానని కేఏ పాల్ వెల్లడించారు. తన దీక్షా శిబిరం దగ్గరకు ఎవరూ రావొద్దని కేఏ పాల్‌ సూచించారు. 

Also Read:తగ్గేదెలే..షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు, విద్యార్థులకు జాగ్రత్తలు ఇవే: మంత్రి ఆదిమూలపు

అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. మే 5 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.

పరీక్షల నిర్వహణకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించామని.. మే 5 నుంచి 19 వరకు పరీక్షలు జరుగుతాయని ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు. మే 5 నుంచి 23 వరకు ఇంటర్ ఫస్ట్, సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి చెప్పారు.

ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన సామాగ్రి ఎగ్జామ్ సెంటర్లకు చేరుకున్నాయని ఆదిమూలపు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1400 పైగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు.

మొత్తం పదిన్నర లక్షల మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతారని మంత్రి చెప్పారు. ఒక్కో సెంటర్‌కు ఒక్కో కోవిడ్ ప్రోటోకాల్ అధికారిని నియమించినట్లు సురేశ్ తెలిపారు. వైరస్ బారినపడిన విద్యార్ధుల కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు.

ప్రతీ సెంటర్‌లో థర్మల్ స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని... పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆదిమూలపు పేర్కొన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన దాఖలాలు లేవని సురేశ్ స్పష్టం చేశారు.