ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. మే 5 నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.

పరీక్షల నిర్వహణకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించామని.. మే 5 నుంచి 19 వరకు పరీక్షలు జరుగుతాయని ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు. మే 5 నుంచి 23 వరకు ఇంటర్ ఫస్ట్, సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి చెప్పారు.

ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన సామాగ్రి ఎగ్జామ్ సెంటర్లకు చేరుకున్నాయని ఆదిమూలపు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1400 పైగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. మొత్తం పదిన్నర లక్షల మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతారని మంత్రి చెప్పారు.

ఒక్కో సెంటర్‌కు ఒక్కో కోవిడ్ ప్రోటోకాల్ అధికారిని నియమించినట్లు సురేశ్ తెలిపారు. వైరస్ బారినపడిన విద్యార్ధుల కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు. ప్రతీ సెంటర్‌లో థర్మల్ స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని... పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆదిమూలపు పేర్కొన్నారు.

Also Read:మీవి, మంత్రుల‌వేనా ప్రాణాలు? లక్షలాది విద్యార్థులవి కావా?: జగన్ పై లోకేష్ ఆగ్రహం

దేశంలోని 29 రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన దాఖలాలు లేవని సురేశ్ స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణను రాజకీయం చేయడం సరికాదని మంత్రి హితవు పలికారు. విద్యార్ధులు, తల్లిదండ్రులను ప్రతిపక్షాలు భయాందోళనలకు గురిచేస్తున్నాయని సురేశ్ ఆరోపించారు.

పాస్‌ సర్టిఫికెట్ విద్యార్ధుల భవిష్యత్‌పై ప్రభావం చూపే అవకాశం వుందని మంత్రి అభిప్రాయపడ్డారు. పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్ధుల ఆత్మస్థైర్యం పెరుగుతుందని సురేశ్ స్పష్టం చేశారు. ఈ రోజు సాయంత్రం ఆరుగంటల నుంచి హాల్ టికెట్లు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని మంత్రి ప్రకటించారు.

విద్యార్ధుల హాల్ టికెట్ల వెనుక కోవిడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని ముద్రించామని సురేశ్ తెలిపారు. విద్యార్ధుల హాల్ టికెట్లు, పరీక్షా  కేంద్రాలు, తమ సీటు నెంబర్ తెలుసుకునేందుకు వీలుగా యాప్‌ను రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. 

 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona