హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వల్ల తనకు ప్రాణహాని ఉందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మత ప్రబోధకుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత నాలుగున్నరేళ్లుగా తనపై ఏడు సార్లు కుట్ర చేశారని ఆరోపించారు. అందులో రెండు ఘటనలను ఆధారాలతో సహా నిరూపించానని తెలిపారు. 

తన కుట్రలపై చంద్రబాబు నాయుడుకు 82 సార్లు ఫోన్ చేసినట్లు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేఏ పాల్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఏపీలో చంద్రబాబు రాక్షసపాలన చేస్తున్నారని ఘాటుగా  విమర్శించారు. 

ఆ రాక్షస పాలన అంతం చేయడానికి అన్ని పార్టీల సహకారంతో రాష్ట్రపతిని కలవబోతున్నట్లు తెలిపారు. తక్షణమే ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన తీసుకువాలని రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి కోరబోతున్నట్లు తెలిపారు. అసలు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది తానేనని చంద్రబాబు కాదని కొట్టిపారేశారు కేఏ పాల్. 

డిసెంబర్ లో పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజాశాంతి ఆధ్వర్యంలో నిర్వహించబోయే రెండు రోజుల బహిరంగ సభలకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చారని ఆ తర్వాత మళ్లీ అప్లై చెయ్యాలంటూ ఆటంకాలు సృష్టిస్తున్నారంటూ ఆరోపించారు.    

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల సమస్య లు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు రక్షణ లేదని, పవన్ కళ్యాణ్ పై దాడులు జరిగే అవకాశం ఉందని స్వయంగా ఆయనే చెప్తున్నారని, హెలికాప్టర్ ప్రమాదంలో జీఎంసీ బాలయోగి ఎలా చనిపోయారు, ఎర్రన్నాయుడు ఎలా చనిపోయారు, లాల్ జాన్ బాషా ఎలా చనిపోయారు, రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయో  వాటిపై సీబీఐతో విచారణ చేయించాలని ప్రధాని నరేంద్రమోదీని కలవనున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో తక్షణమే రాష్ట్రపతి పాలన తీసుకురావాల్సిందేనని ఆయన చెప్పారు.  తనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటే ప్రజా ఆదరణ ఉందని, పవన్ కళ్యాణ్ ప్రెస్మీట్ పెడితే టీవీల్లో కేవలం 4 వేల మంది చూస్తే కేఏపాల్ ప్రెస్మీట్ పెడితే 14లక్షల మంది చూస్తున్నారని తెలిపారు. తనకు ఉన్న ప్రజాదరణ వల్లే తన బహిరంగ సభలు జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.