రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ ఛైర్‌ పర్సన్, సభ్యుల ఎంపికపై సచివాలయంలో రాష్ట్ర మానవ హక్కుల కమిటీతో సీఎం వైఎస్ జగన్‌ సమావేశమయ్యారు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ మానవ హక్కుల కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సీతారామ మూర్తి పేరు ఖరారయ్యింది. సభ్యులుగా విశ్రాంత జిల్లా న్యాయమూర్తి దండే సుబ్రహ్మణ్యం(జ్యుడీషియల్‌), న్యాయవాది డాక్టర్‌ జి శ్రీనివాసరావు (నాన్‌ జ్యుడీషియల్‌)లను నియమించాలని ఉన్నతస్థాయి కమిటీ ప్రతిపాదించింది. 

రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ ఛైర్‌ పర్సన్, సభ్యుల ఎంపికపై సచివాలయంలో రాష్ట్ర మానవ హక్కుల కమిటీతో సీఎం వైఎస్ జగన్‌ సమావేశమయ్యారు. కమిటీ సభ్యులైన శాసనమండలి ఛైర్మన్‌ ఎం ఏ షరీఫ్, శాససనభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరితతో సీఎం చర్చించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఛైర్‌ పర్సన్, సభ్యుల పేర్లను హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రతిపాదించగా కమిటీ ఆమోదం తెలిపింది.

ఇదిలావుంటే మానవ హక్కుల ఛైర్మన్, సభ్యుల ఎంపిక సమావేశాన్ని టిడిపి బహిష్కరిస్తున్నట్లు శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ప్రకటించారు. రాష్ట్రంలో ఏ వ్యక్తి హక్కులైకైనా రక్షణ ఉందా? అని ప్రశ్నించారు. హక్కులకు గౌరవం లేని ఏకైక రాష్ట్రం ఏపీనే అని యనమల ఆరోపించారు. 

''రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా వ్యక్తుల స్వేచ్ఛ, గౌరవానికి భంగం కలిగినప్పుడు అతి తక్కువ ఖర్చుతో న్యాయం పొందే అవకాశం మానవ హక్కుల కమిషన్‌ కల్పిస్తుంది. కానీ నేటి ప్రభుత్వం సుప్రీంకోర్టు ఉత్తర్వులు బేఖాతర్ చేస్తూ మానవ హక్కుల కమీషన్ ఏర్పాటు చేయకుండా కాలయాపన చేసింది'' అని యనమల ఆరోపించారు.