జస్టిస్ చలమేశ్వర్ అలక: వీడ్కోలు విందుకు నో

జస్టిస్ చలమేశ్వర్ అలక: వీడ్కోలు విందుకు నో

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ జూన్ 22వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. తన గౌరవార్థం సుప్రీంకోర్టు బార్ ఆసోసియేషన్ తలపెట్టిన వీడ్కోలు విందుకు హాజరయ్యేందుకు ఆయన నిరాకరించారు. 

బార్ ఆసోసియేషన్ కార్యదర్శి విక్రాంత్ యాదవ్ నేతృత్వంలోని 18 మంది కార్యవర్గ సభ్యులు బుధవారం ఆయన నివాసానికి వెళ్లి తాము తలపెట్టిన వీడ్కోలు విందు గురించి చెప్పారు. అయితే, జాస్తి చలమేశ్వర్ అందుకు విముఖత ప్రదర్శించారు. 

కోర్టుకు ఈ నెల 18వ తేదీన సెలవులు ప్రారంభమై జూలై 1వ తేదీ వరకు కొనసాగుతాయి. దాంతో ఆయన పనిదినం మే 18వ తేదీ అవుతోంది. అదే రోజు సుప్రీంకోర్టు ఆవరణలో ఆయనకు వీడ్కోలు పలకడానికి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ భావించింది. 

తన విముఖతకు గల కారాణాలను చలమేశ్వర్ చెప్పలేదు. కానీ తనను కారణాలు అడగవద్దని, తాను హైదరాబాదు హైకోర్టు నుంచి పదోన్నతి పొందినప్పుడు కూడా ఇదే విధంగా వీడ్కోలు విందును నిరాకరించానని ఆయన చెప్పారు. 

జాస్తి చలమేశ్వర్ బుధవారం నుంచే సెలవు తీసుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. దాంతో తుగ్లక్ రోడ్ లోని భవనంలో ఉన్న పుస్తకాలను, ఇతర సామగ్రిని ప్యాక్ చేయడం ప్రారంభించారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో గల తన స్వగ్రామం పెదముత్తెవిలో స్థిరపడాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. 

అయితే, గత కొంత కాలంగా సుప్రీంకోర్టులో జరుగుతున్న వ్యవహారాల నేపథ్యంలో ఆయన వీడ్కోలు విందుకు నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టులో సీనియరిటీ ప్రకారం జస్టిస్ చలమేశ్వర్ రెండోవారు. 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page