అమరావతి: ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బాలయోగి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే అత్యవసరంగా తన పదవికి రాజీనామా చేసిన బాలయోగి చంద్రబాబునాయుడును కలవడంతో త్వరలోనే ఆయన టీడీపీలో చేరతారంటూ చర్చ జరుగుతోంది. 

హైదరాబాద్ సిటీ హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్న ఆయన ఇటీవలే తన పదవికి రాజీనామా చేశారు. వాస్తవానికి బాలయోగి పదవీకాలం జనవరి 14 వరకు ఉంది. అయితే అత్యవసరంగా ఆయన తన పదవికి రాజీనామా చెయ్యడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. 

బాలయోగి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ ప్రచారం జరిగింది. అందువల్లే ముందే తన పదవికి రాజీనామా చేశారంటూ జోరుగా చర్చ జరిగింది. ఇప్పటికే ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో చర్చలు జరిపారని ఊహాగానాలు వినిపించాయి. త్వరలో ఏపీలో జరగబోయే ఎన్నికల్లో ఆయన ఏదో ఒక పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని లేదా వైసీసీపీలో కీలక పాత్ర పోషిస్తారంటూ ప్రచారం జరిగింది. 

అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో శుక్రవారం ఉదయం సీఎం చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జస్టిస్ నక్కా బాలయోగి స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా ముమ్ముడి వరం. తొందర్లోనే టీడీపీలో చేరబోతున్నారని ఆయన అమలాపురం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆ విషయంపై చర్చించేందుకు చంద్రబాబుతో సమావేశమయ్యారని సరైన హామీ లభిస్తే ఆ పార్టీలో చేరతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఇకపోతే నక్కా బాలయోగి 2017 జనవరి 17న పదోన్నతిపై హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి హైదరాబాద్ సిటీ హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్నారు. అయితే ఇటీవలే బాలయోగి తన పదవికి రాజీనామా చేశారు. 

ఆయన రాజీనామాను కేంద్ర న్యాయశాఖ ఆమోదించింది. డిసెంబర్ 15న బాలయోగి విధుల నుంచి నిష్క్రమించవచ్చునని న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి కశ్యప్ ఉత్తర్వలు జారీ చేశారు. అయితే బాలయోగి ఇటీవలే వైసీపీలో చేరతారని ప్రచారం జరగడం తాజాగా ఆయన చంద్రబాబు నాయుడును కలవడంతో ఆయన ఎటువైపు వెళ్తారు ఏ పార్టీలోకి వెళ్తారు అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం స్తానంపై వైసీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆయన చంద్రబాబువైపు అడుగులు వేస్తున్నారా అంటూ చర్చ జరుగుతుంది. వైసీపీలో అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా మాజీమంత్రి పినిపే విశ్వరూప్ ఉన్నారు. ఆయనను తప్పించే సాహసం జగన్ చేయకపోవచ్చునని సమాచారం. 

ఇకపోతే అమలాపురం ఎంపీగా టీడీపీకి చెందిన పండుల రవీంద్రబాబు కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా పండుల రవీంద్రబాబు పోటీ చెయ్యాలని భావిస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. అంతకు మించి బాలయోగి ఏ పార్టీలో చేరతారనేది తెలియాల్సి ఉంది.