తెలుగుదేశం పార్టీనీ కాపాడే నాథుడు ఎవరు? ప్రస్తుతం ఈ చర్చ ఆ పార్టీలోనే కాదు, ఏపీలోని అన్ని పార్టీల్లోనూ జోరుగా జరుగుతోంది. సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో వరుస ఓటములకు తోడు.. కీలక నేతలు, పార్టీకి ఎప్పటి నుంచో కొమ్ముకాస్తూ వస్తున్న కేడర్ చేజారిపోతుండడం పార్టీ అధిష్టానంలో ఆందోళన పెంచుతోంది. ఇప్పటికే కీలక నేతలంతా వైసీపీ , బీజేపీల్లోకి వెళ్లిపోయారు.

ప్రస్తుతం చంద్రబాబు వెంట ఉన్న నేతలు ఎవరు అన్నది కూడా అంతు చిక్కడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే వేళ్ల పై లెక్కించేంత మంది చంద్రబాబుతో రెగ్యులర్‌గా జూమ్ మీటింగ్‌లో పాల్గొంటూ ఉంటున్నారని పార్టీ నేతలు చెబుతున్న మాట. దీనికి తోడు జగన్ స్పీడ్‌కు హైకమాండ్ ధీటుగా సమాధానం ఇవ్వలేకపోతుండటంతో టీడీపీ కీలక నేతల్లో కొందరు పక్క చూపులు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ నామస్మరణ రోజు రోజుకూ పెరుగుతోంది. పార్టీకి మళ్లీ పూర్వవైభవం రావాలంటే ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలనే డిమాండ్ పెరుగుతోంది. ఎన్టీఆర్ ఎక్కడ కనిపించినా.. అభిమానులు, టీడీపీ కార్యకర్తలు కాబోయే సీఎం అంటూ నినాదాలు కూడా చేస్తున్నారు. దీనిపై ఎన్టీఆర్ సీరియస్ అవుతున్నా.. అభిమానుల నుంచి డిమాండ్ ఆగడం లేదు.. ఇంకాస్త పెరుగుతూ వస్తోంది.

Also Read:రాజకీయాల్లోకి జూ. ఎన్టీఆర్ పక్కా: 2001 నుంచే ప్లాన్

మొన్నామధ్య కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబుకే స్వయంగా నిరసన సెగ ఎదురైంది. పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్‌ను ఎప్పుడు తీసుకొస్తున్నారంటూ కార్యకర్తలు నిలదీశారు. కానీ టీడీపీ చీఫ్.. మాటను దాట వేశారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన ఫ్యాన్స్ జెండా తయారు చేసి ఆవిష్కరించారు. కుప్పం మండలం మంకలదొడ్డి పంచాయ ములకలపల్లి గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ఇలా తమ అభిమానాన్ని చాటుకున్నారు.

మాస్ ఇమేజ్, తాత ఎన్టీఆర్ పోలికలు, ఎంతటివారినైనా మాటలతో ఆకట్టుకునే తత్వం ఉండటంతో జూనియర్‌ను తెలుగుదేశం పార్టీలో క్రీయాశీలకంగా చూడాలని అభిమానులు భావిస్తున్నారు. గతంలోనూ ఎన్టీఆర్ టీడీపీ తరపున ఎన్నికల ప్రచారం చేశారు. తాను తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల పని చేస్తానని, ఎప్పుడు తన అవసరం వస్తే అప్పుడు సేవలందిస్తానని గతంలోనే జూనియర్ ప్రకటించారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో వుండటంతో రావాల్సిన సమయం వచ్చిందని అంటున్నారు.