చంద్రబాబు బెయిల్ పై అదనపు షరతులపై నేడు తీర్పు...
చంద్రబాబు మధ్యంతర బెయిల్ నిబంధనల్లో మరికొన్ని షరతులు చేర్చాలని సీఐడీ హైకోర్టును కోరుతోంది.

అమరావతి : ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిలుపై బైటికి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు. ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నేడు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో కంటి పరీక్షలు చేయించుకోనున్నారు. కాగా...స్కిల్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్పై విడుదలైన చంద్రబాబుకు అదనపు షరతులు విధించాలన్న సీఐడీ పిటిషన్పై హైకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది.
రాజకీయ ప్రసంగాలు, ర్యాలీలు చేయకూడదని, మీడియాతో మాట్లాడొద్దని, ఇద్దరు డీఎస్పీలను ఆయనతో పాటు ఉంచాలని సీఐడీ కోరగా, చంద్రబాబు న్యాయవాదులు దీనికి అభ్యంతరం తెలిపారు.ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై నేడు తీర్పువెలువరించనున్నారు.
ఇదిలా ఉండగా.. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడికి అక్టోబర్ 31 మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. స్కిల్ స్కాం కేసులో సెప్టెంబర్ తొమ్మిదిన నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. 53 రోజులుగా రాజమండ్రి కేంద్ర కారాగారంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు.
అనారోగ్య కారణాల వల్ల నాలుగువారాల మధ్యంతర బెయిలును మంజూరు చేసింది. ఐదు షరతులు విధించింది. ఇక పూర్తి ప్రధాన బెయిల్ పిటిషన్ పై ఈ నెల 10వ తేదీన వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. అంతేకాదు నాలుగు వారాల పాటు స్కిల్ స్కామ్ లో మాత్రమే బెయిల్ మంజూరు చేసినట్టుగా హైకోర్టు తెలిపింది. ఆయన ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స చేయించుకోవచ్చని తెలిపింది.