తిరుపతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై ఇటీవల తీవ్రవ్యాఖ్యలు చేసిన జడ్జి రామకృష్ణను మదనపల్లెలో పోలీసులు అరెస్ట్ చేశారు.  బీ కొత్తకోట నుంచి మదనపల్లెలో కరోనా టెస్ట్ కోసం వెళుతుండగా దారి మధ్యలో జడ్జి రామకృష్ణ పోలీసులు అదుపులోకి తీసుకొని పీలేరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయనను కోర్టులో హాజరు పర్చనున్నట్లు సమాచారం. 

తన అరెస్ట్ పై రామకృష్ణ స్పందిస్తూ...గతంలో  నంద్యాల ఉపఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నడిరోడ్డుపై కాల్చి చంపాలని అన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు తాను అదే విధంగా అన్నానని చెప్పారు. జగన్ అప్పటి ముఖ్యమంత్రిపై చేసిప వ్యాఖ్యలు తప్పుకానప్పుడు ఇప్పుడు తాను సీఎం జగన్‌ను అంటే దేశ ద్రోహం ఎలా అవుతుందని రామకృష్ణ  ప్రశ్నించారు.

read more  జడ్జి రామకృష్ణ సోదరుడిపై దాడి: వైసీపీ కార్యకర్తల పనేనంటున్న కుటుంబసభ్యులు

 గతంలో కూడా న్యాయమూర్తి రామకృష్ణను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  రామకృష్ణ పిన్నమ్మ మరణించిన తర్వాత కూడా ఆమె పింఛన్ ను ఫోర్జరీ చెక్కుల ద్వారా డ్రా చేసుకున్నాడని బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మదనపల్లె పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. 

న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై గతంలో దుండగులు దాడి చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అనుచరులే ఆ దాడి చేశారని రామకృష్ణ ఆరోపించారు. ఈ దాడిని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. దళిత సంఘాలు కూడా ఖండించాయి. అయితే, ఆ దాడితో తనకు ఏ సంబంధమూ లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు