దివంగత సీఎం వైఎస్సార్ నాకు మంచి మిత్రుడని.. ఆంధ్రప్రదేశ్ వరకు ఆయన తనకు మెంటర్‌గా ఉండేవారని జేఎస్‌డబ్ల్యూ చైర్మన్ సజ్జన్ జిందాల్ చెప్పారు. సీఎం జగన్‌తో చాలా కాలంగా పరిచయం ఉందన్నారు.

దివంగత సీఎం వైఎస్సార్ నాకు మంచి మిత్రుడని.. ఆంధ్రప్రదేశ్ వరకు ఆయన తనకు మెంటర్‌గా ఉండేవారని జేఎస్‌డబ్ల్యూ చైర్మన్ సజ్జన్ జిందాల్ చెప్పారు. సీఎం జగన్‌తో చాలా కాలంగా పరిచయం ఉందన్నారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్‌ నిర్మాణానికి సీఎం జగన్‌, సజ్జన్ జిందాల్‌ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సజ్జన్ జిందాల్ మాట్లాడుతూ.. వైఎస్సార్‌తో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 

చాలా ఏళ్ల క్రితం తాను వైఎస్ రాజశేఖరరెడ్డిని కలిసినప్పుడు.. అప్పుడు జగన్ యంగ్ బాయ్ అని అన్నారు. జగన్‌ను ముంబై తీసుకెళ్లి బిజినెస్ ఎలా రన్ చేయాలో నేర్పించమని ఆయన చెప్పేవారని తెలిపారు. 15-17 ఏళ్ల క్రితం సీఎం జగన్ తన ఆఫీసుకు కూడా వచ్చారని చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్‌ను వైఎస్సార్ ఎంతగానో అభివృద్ది చేశారని.. నేడు జగన్ కూడా తండ్రిబాటలో నడుస్తున్నారని అన్నారు. తాను దేశంలోని వివిధ ప్రాంతాలకు తిరుగుతానని, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తుంటానని.. ప్రతి ఒక్కరు కూడా ఏపీ అభివృద్ది, సీఎం జగన్ లీడర్‌షిప్ గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. ఎందుకంటే.. ఏపీ వేగంగా అభివృద్ది చెందుతుందని అన్నారు. 

‘‘ఆంధ్రప్రదేశ్ గ్రోత్‌కు సీఎం జగన్ డెడికేషన్, కమిట్‌మెంట్ కారణం. ఏపీ ప్రజల జీవనాన్ని ఎలా మెరుగుపరచాలన్నదే ఆయన ఆలోచన. నేను లాస్ట్ టైమ్ జగన్‌ను విజయవాడలో కలిసినప్పుడు.. ఏపీలో జరుగుతున్న అభివృద్ది గురించి వివరించారు. జగన్ లాంటి యంగ్, డైనమిక్ లీడర్ ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటనేది ఏపీ ప్రజలకు తెలుస్తోంది. విజయవాడ నుంచి ఇక్కడకు స్టీల్ ప్లాంట్ భూమి పూజ కోసం సీఎం జగన్ ప్రత్యేకంగా వచ్చారు. ఈ రోజు చేస్తున్న భూమి పూజ బిగినింగ్ స్టెప్. రానున్న రోజుల్లో అద్భుతమైన స్టీల్ ప్లాంట్‌గా రూపొందనుంది’’ అని సజ్జన్ జిందాల్ అన్నారు.