తెలుగుదేశం పార్టీ పగ్గాలను జూనియర్ ఎన్టీఆర్ అందుకోవాలంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు జూనియర్ ఫ్యాన్స్ నుంచి చేదు అనుభవం ఎదురైంది.
టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట పర్యటనలో చేదు అనుభవం ఎదురైంది. ఆయన రాక సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చిన అభిమానులు.. ఎన్టీఆర్‌కు అనుకూలంగా నినాదాలు చేయడంతో పాటు ఆయన జెండాలు, ఫ్లెక్సీలు, బ్యానర్‌లతో నానా రచ్చ చేశారు. దీంతో చంద్రబాబు కాస్త అసహనానికి గురయ్యారు.
2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తర్వాత.. పార్టీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలనే డిమాండ్ ఊపందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడున్న పరిస్ధితుల్లో పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురాగల సత్తా ఎన్టీఆర్‌కు మాత్రమే వుందని పలువురు తెలుగుదేశం నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. స్వయంగా చంద్రబాబు నాయుడు పర్యటనల వేళ.. టీడీపీ కేడర్, నందమూరి ఫ్యాన్స్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావిస్తూ నినాదాలు చేస్తూ వుండటంతో ఆయన కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ALso Read: కుప్పం పర్యటన: జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీల హంగామా, చంద్రబాబు పక్కనే
మరోవైపు.. తెలుగుదేశం పార్టీ పగ్గాలను జూనియర్ ఎన్టీఆర్ అందుకోవాలంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరి కోసమో, ఎవరో అడిగారని జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు తీసుకోరని కొడాలి నాని స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు కుప్పంలోనూ ఎదురుగాలి వీస్తోందన్నారు. చివరికి కుప్పంలో కూడా చంద్రబాబు పోరాడాల్సిన పరిస్ధితి వచ్చిందని కొడాలి నాని పేర్కొన్నారు.
కుప్పంలోనూ చంద్రబాబు పీడ విరగడ అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. జగన్ దెబ్బకు టీడీపీ, జనసేన, బీజేపీ కకావికలం కాకతప్పదని కొడాలి నాని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని.. చంద్రబాబు పార్టీ, పవన్ పార్టీ పొత్తు పెట్టుకుంటాయని కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబు కొత్త పార్టీ పెట్టుకుంటారన్న అర్ధంలో మాట్లాడారు కొడాలి నాని. రెండు పార్టీలను జగన్ చిత్తుచిత్తుగా ఓడిస్తారని ఆయన జోస్యం చెప్పారు.
