Asianet News TeluguAsianet News Telugu

కుప్పం పర్యటన: జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీల హంగామా, చంద్రబాబు పక్కనే

ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సాగుతుండగానే.. కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు హల్ చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 

Jr NTR posters, flexis erected in Kuppam
Author
First Published Aug 26, 2022, 4:50 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన సందర్భంగా సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు సందడి చేస్తున్నాయి. టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అమిత్ షాను జూనియర్ కలిసిన నాటి నుంచి ఆయన రాజకీయ ప్రవేశంపై చర్చ మొదలైంది. ఇలాంటి సమయంలో కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు టీడీపీ అభిమానులు. 

మరోవైపు.. తెలుగుదేశం పార్టీ పగ్గాలను జూనియర్ ఎన్టీఆర్ అందుకోవాలంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరి కోసమో, ఎవరో అడిగారని జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు తీసుకోరని కొడాలి నాని స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు కుప్పంలోనూ ఎదురుగాలి వీస్తోందన్నారు. చివరికి కుప్పంలో కూడా చంద్రబాబు పోరాడాల్సిన పరిస్ధితి వచ్చిందని కొడాలి నాని పేర్కొన్నారు. కుప్పంలోనూ చంద్రబాబు పీడ విరగడ అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. జగన్ దెబ్బకు టీడీపీ, జనసేన, బీజేపీ కకావికలం కాకతప్పదని కొడాలి నాని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని.. చంద్రబాబు పార్టీ, పవన్ పార్టీ పొత్తు పెట్టుకుంటాయని కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబు కొత్త పార్టీ పెట్టుకుంటారన్న అర్ధంలో మాట్లాడారు కొడాలి నాని. రెండు పార్టీలను జగన్ చిత్తుచిత్తుగా ఓడిస్తారని ఆయన జోస్యం చెప్పారు. 

Also REad:జూనియర్ ఎన్టీఆర్ వెంటనే రాజకీయాల్లో రావాలి.. టీడీపీని టేకోవర్ చేయాలి: లక్ష్మీపార్వతి

కేంద్ర హోం మంత్రి  అమిత్ షా, ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ల భేటీపైనా కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఉపయోగం లేకుంటే ఎవరితో నిమిషం కూడా మాట్లాడరని కొడాలి నాని అన్నారు. బీజేపీని విస్తరించేందుకే జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ అయ్యారని అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ మద్దతుతో బీజేపీని బలపర్చుకోవడానికి అమిత్ షా ప్రయత్నిస్తున్నారని తాను భావిస్తున్నట్టుగా కొడాలి నాని చెప్పారు. ‘‘జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ కాబట్టే.. దేశవ్యాప్తంగా ప్రచారం చేయించుకునే అవకాశం ఉందని కలిశారు. చంద్రబాబుతో ప్రయోజనం లేకపోవడంతోనే మోదీ, అమిత్ షాలు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని అన్నారు’’ అని కొడాలి నాని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios