టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో : ఆమోదం పొందిన అంశాలివే...
అధికారంలోకి వస్తే ప్రస్తుత పథకాలను బలోపేతం చేస్తామని, జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిన పథకాలను పునరుద్ధరించే అంశాన్ని పరిశీలిస్తామని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో 2024 ప్రారంభంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అక్కడి ప్రధాన ప్రతిపక్షాలైన టిడిపి-జనసేన పొత్తు పెట్టుకోవాలని నిర్ణయానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంగళవారం టిడిపి-జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ తొలి భేటీ ముగిసింది. ఈ మేనిఫెస్టోలో సంక్షేమంతో కూడిన అభివృద్ధే ప్రధాన అజెండాగా టిడిపి- జనసేన మేనిఫెస్టో ఉండబోతోంది. దీనిమీదే కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
ఈ భేటీకి జనసేన నుంచి ముత్తా శశిధర్, వరప్రసాద్, శరత్ కుమార్ లు మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా హాజరుకాగా.. టిడిపి నుంచి యనమల రామకృష్ణుడు, పట్టాభి, అశోక్ బాబులు హాజరయ్యారు. సమావేశంలో మేనిఫెస్టోలో ఉండాల్సిన అంశాలపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇరు పార్టీల నేతలు మీడియాతో మాట్లాడారు. జనసేన ప్రతిపాదించిన ఐదు అంశాలు.. టిడిపి ప్రతిపాదించిన ఆరు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు.
vijayasai reddy : పురందేశ్వరి గారూ... బీజేపీలో ఎన్నాళ్ళు ఉంటారో చెప్తారా ? - విజయసాయి రెడ్డి
అలా మొత్తం ఈ అంశాలను చేర్చి ఉమ్మడిగా 11 అంశాలతో కూడిన మినీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా తెలిపారు. ఇది తొలి సమావేశం అని… పూర్తిస్థాయి మేనిఫెస్టో ఇంకా రూపొందించాల్సి ఉందని తెలిపారు. ఈ ఉమ్మడి కమిటీ సభ్యులు మాట్లాడుతూ వివిధ వర్గాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు తీసుకొని పూర్తిస్థాయిలో మేనిఫెస్టోలో రూపొందిస్తామని చెప్పుకొచ్చారు. ప్రజల్లో టిడిపి - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో అంటే తప్పనిసరిగా అమలవుతుందని నమ్మకం ఉందని… ఆ పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు.
ఈ మినీ మెనీ ఫెస్టోలో యువతకు నమ్మకం కలిగించి ధైర్యం చెప్పే ఉపాధి పథకాలు ప్రతిపాదించామని చెప్పుకొచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి - జనసేన కూటమి ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టిడిపి జనసేన మేనిఫెస్టోలో చేర్చి ఆమోదం పొందిన అంశాలు ఇవే..
- అమరావతే రాజధానిగా కొనసాగింపు
- సూక్ష్మ, చిన్న, మధ్య తరహా స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేయడానికి రూ. 10 లక్షల వరకు రాయితీ
- బీసీలకు రక్షణ చట్టం తీసుకురావడం
- ఆక్వా, ఉద్యాన, పాడి రైతులకు ప్రోత్సాహకాలు
- రద్దు చేసిన సంక్షేమ పథకాలపై పునః పరిశీలన
- పేదలకు ఉచిత ఇసుక, కార్మిక సంక్షేమం
- రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి బయటకు తీసుకువచ్చే విధానాలపై నిర్ణయం
- అసమానతలు తొలగిపోయి ఆర్థిక వ్యవస్థ బాగుపడేలా ప్రణాళిక రూపకల్పన
- ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా
వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, రక్షణ, సమ్మిళిత ఆర్థిక వృద్ధి (సంపన్న ఆంధ్రప్రదేశ్)
- పేదరిక నిర్మూలన
దీనిమీద యనమల మాట్లాడుతూ.. రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృత చర్చ జరిగిందని, మినీ మ్యానిఫెస్టోను సమగ్ర డాక్యుమెంట్‌గా రూపొందించేందుకు అన్ని వాటాదారులతో విస్తృత సంప్రదింపుల అనంతరం మరిన్ని అంశాలను పొందుపరుస్తామని తెలిపారు. ఆ తర్వాత తుది ఆమోదం కోసం టీడీపీ-జేఎస్పీ జాయింట్ యాక్షన్ కమిటీకి సమర్పించనున్నారు.