vijayasai reddy : పురందేశ్వరి గారూ... బీజేపీలో ఎన్నాళ్ళు ఉంటారో చెప్తారా ? - విజయసాయి రెడ్డి
vijayasai reddy : బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ ముఖ్య నాయకుడు, ఎంపీ - విజయసాయి రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ లో నుంచి ఎందుకు బయటకు వచ్చారని, అసలు బీజేపీలో ఎంత కాలం ఉంటారో చెప్పాలని కోరారు.
వైసీపీ ముఖ్య నాయకుడు, ఎంపీ విజయ సాయిరెడ్డి (vijayasai reddy) మళ్లీ బీజేపీ (bjp) ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (purandeswari) గుప్పించారు. టీడీపీ నుంచి ఎందుకు వచ్చారని, తరువాత కాంగ్రెస్ (congress) లోకి చేరి, అక్కడి నుంచి ఎందుకు బయటకు వచ్చారని ప్రశ్నించారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్నా.. అక్కడ ఎంత కాలం ఉంటారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఈ మేరకు పురందేశ్వరి పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) హ్యాండిల్ లో సోమవారం ఓ పోస్టు పెట్టారు.
అందులో ‘‘పురందేశ్వరి గారూ... మీరు టీడీపీలో ఎన్నాళ్ళు ఉన్నారో, కాంగ్రెస్ కు ఎందుకు వెళ్ళారో, కాంగ్రెస్ నుంచి ఎందుకు బయటకు వచ్చారో, బీజేపీలో ఎందుకు చేరారో, ఇందులో ఏ ఒక్క ప్రశ్నకీ సమాధానం చెప్పలేకపోయారు. కనీసం బీజేపీలో ఎన్నాళ్ళు ఉంటారన్నదైనా చెప్పగలరా?’’ అని పేర్కొన్నారు.
అంతకు ముందు మరో పోస్టులో కూడా పురందేశ్వరిపై విజయసాయి రెడ్డి ఇలాంటి విమర్శలే చేశారు. ఎన్టీఆర్ (NTR) పెద్ద కూతురిగా పుట్టి, ఆయననే వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. తరువాత ఎన్టీఆర్ వ్యతిరేకించే కాంగ్రెస్ (Congress) లో చేరారని, అక్కడ మంత్రి పదవి చేపట్టారని తెలిపారు. ఇక కాంగ్రెస్ కు అధికారం ఉండబోదని బీజేపీలో చేరారని ఆరోపించారు. ‘‘ఎన్టీఆర్ పెద్ద కూతురిగా పుట్టి, ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి, ఎన్టీఆర్ వ్యతిరేక కాంగ్రెస్ లో మంత్రి పదవి అనుభవించి, కాంగ్రెస్ కు అధికారం దక్కదని బీజేపీలో చేరి, బీజేపీలో పదవి పొంది, టీడీపీ అధ్యక్షుడైన మీ మరిది కోసం, అది కూడా.. తెలంగాణలో కాంగ్రెస్ తో జతకట్టిన మీ మరిది కోసం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా కొమ్ముకాస్తున్నారంటే...ఇన్ని రంగులు మార్చగల మీ నైపుణ్యాన్ని ఏమని పిలవాలి?’’ అని ప్రశ్నించారు.