హైదరాబాద్: తమ పార్టీని వీడడానికి సిద్ధపడుతున్న నేతలను తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలువరించడం లేదు. వారిని ఆపడానికి ఆయన ఏ మాత్రం ప్రయత్నాలు చేయడం లేదు. అయితే, పార్టీని వీడుతున్న నాయకులు మాత్రం బిజెపిలో మాత్రమే చేరేలా చూసుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ నేతలు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో, తెలంగాణ నేతలు టీఆర్ఎస్ లో చేరకుండా ఆయన జాగ్రత్త పడుతున్నారు. తన ప్రత్యర్థి పార్టీల్లో చేరకుండా చూసుకుంటున్నారు. చంద్రబాబుకు చెప్పిన తర్వాత తాము బిజెపిలోకి వచ్చామని రాజ్యసభ సభ్యులు చెప్పిన విషయం తెలిసిందే.  తాము బిజెపిలో చేరుతున్న విషయాన్ని చంద్రబాబుకు చెప్పామని టీజీ వెంకటేష్, సుజనా చౌదరి చెప్పిన విషయం తెలిసిందే.

పార్టీని వీడుతున్నవారిని నిలువరించడానికి ఏ మాత్రం ప్రయత్నం చేయకుండా చంద్రబాబు వారు వైసిపిలో గానీ టీఆర్ఎస్ లో గానీ చేరకుండా చూసుకుంటున్నారనే మాట వినిపిస్తోంది. తనకు అత్యంత సన్నిహితులైన సిఎం రమేష్, సుజనా చౌదరి బిజెపిలో చేరడాన్ని నిలువరించడానికి టీడీపీ అధినాయకత్వం ఏ మాత్రం ప్రయత్నం చేయలేదు. 

తెలంగాణలో కూడా చంద్రబాబు అదే వైఖరిని అవలంబిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఇటీవల బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. తన నిర్ణయాన్ని చంద్రబాబుకు చెప్పినట్లు ఆయన బహిరంగంగానే చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో వైసిపికి వ్యతిరేకంగా పోరాడాలని, తెలంగాణలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేయాలని టీడీపీ అధిష్టానం బిజెపిలో చేరుతున్న నాయకులకు స్పష్టంగా చెబుతున్నట్లు సమాచారం.