విజయవాడ  తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతలపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత జోగి రమేష్ తిట్ల దండకం ఎత్తుకున్నారు. బుద్ధి జ్ఞానం లేని వెధవలంతా టీడీపీలో చేరారని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటన్న చర్యలపై టీడీపీ నేతలు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని ఆయన గురువారం మీడియా ,సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజలకు అండగా ఉన్నారని ఆయన చెప్పారు.

ప్రాణాలను లెక్క చేయకుండా తమ ప్రజాప్రతినిధులు, మంత్రులు పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలు చెత్తగా ఓడించినా కూడా టీడీపీ నేతలకు సిగ్గు రాలేదని ఆయన అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సమయంలో సీఎంగా ఉంటే కరోనా పేరుతో కాసుల పంట పండించుకునేవారని ఆయన అన్నారు. దుర్మార్గమైన, నీచమైన, నికృష్టమైన ప్రతిపక్ష నేతగా చంద్రబాబును ఆయన అభివర్ణించారు.

హైదరాబాదులో కూర్చుని చంద్రబాబు మాట్లాడుతున్నారని, తాము క్షేత్ర స్థాయిలో తిరిగి ప్రజల కష్టాల్లో పాలుపంచుకుంటున్నామని ఆయన అన్నారు.  చిన్న పొరపాటు ఏదైనా జరిగితే ప్రభుత్వ దృష్టికి తేవాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో బాధ్యతలేని పనికి మాలిన ప్రతిపక్షాలున్నాయని ఆయన అన్నారు. ప్రజలకు భరోసా ఇవ్వాలనే ఆలోచన కూడా ప్రతిపక్షాలకు లేదని ఆయన అన్నారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడికి జగన్ తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోడీ నుంచి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి వరకు ప్రశంసించారని ఆయన అన్నారు తెలుగుదేశం నాయకులు సన్నాసుల్లా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు వేల మందికి పరీక్షలు చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కడూ మీడియా ముందుకు రావడమే అని ఆయన విరుచుకుపడ్డారు.

తెలియక మట్లాడుతావా, తెలిసి కూడా తెలియక మాట్లాడుతావా అని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబుకు శాశ్వతంగా క్వారంటైన్  తప్పదని ఆయన అన్నారు. కరోనాకు భయపడి చంద్రబాబు హైదరాబాదులో ఉంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.