విశాఖపట్నం: సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ భవిష్యత్తు ఏమిటనేది తెలియడం లేదు. ఆయన ఎటు వైపు పయనిస్తున్నారనే విషయం తేలడం లేదు. సాంకేతికంగా ఆయన జనసేన పార్టీలో ఉన్నట్లే. కానీ, జనసేన కార్యక్రమాలకు ఆయన దూరంగానే ఉంటున్నారు.

కేంద్ర సర్వీసుల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన తొలుత ఆమ్ ఆద్మీ, లోక్ సత్తా పార్టీల్లో చేరుతారనే ప్రచారం సాగింది. అయితే, ఎన్నికల ముందు హడావిడిగా జనసేనలో చేరి విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి పోటీ చేశారు. దానికి ముందు ఆయన టీడీపీలో చేరుతారనే ప్రచారం సాగింది. కానీ, అనూహ్యంగా ఆయన జనసేనలో చేరారు. 

దానికి ముందు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై, వ్యవసాయోత్పత్తుల పెరుగుదలపై దృష్టి పెట్టారు. జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. 

జనసేన విశాఖపట్నంలో చేపట్టిన లాంగ్ మార్చ్ కు ఆయన దూరంగానే ఉన్నారు. కాకినాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టి రైతు సౌభాైగ్య దీక్లలో కూడా ఆయన కనిపించలేదు. జేడీ లక్ష్మినారాయణ తమ పార్టీలో ఉన్నారా, లేదా అనే విషయం జనసేన కార్యకర్తలకే అంతు చిక్కడం లేదు. 

జనసేన నుంచి బయటకు వచ్చి బిజెపిలో చేరుతారంటూ ప్రచారం జరిగింది. అయితే, ఆయన కోర్కెను బిజెపి నాయకత్వం తీర్చడానికి ఇష్టపడలేదని అంటున్నారు. తనకు పార్టీ రాష్ట్రాధ్యక్ష పదవి ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. అయితే, ఎన్నికలకు వరకు పనిచేయాలని, ఆ తర్వాత ఆ విషయాన్ని పరిశీలిస్తామని వారు చెప్పినట్లు సమాచారం. దాంతో ఆయన వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు