Asianet News TeluguAsianet News Telugu

నాపై మళ్లీ కేసులు పెట్టేందుకు యత్నం.. పోలీసులు లేకుంటే మా ఎమ్మెల్యే అడుగు ముందుకు పడదు: జేసీ ప్రభాకర్ రెడ్డి

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు.

jc prabhakar reddy slams kethireddy pedda reddy and kethireddy venkatarami reddy ksm
Author
First Published Jul 10, 2023, 12:00 PM IST

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. తనపై మళ్లీ  కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు లేకుంటే అడుగు ముందుకు వేయలేని పరిస్థితి తమ ఎమ్మెల్యేదని విమర్శించారు. ‘ఎమ్మెల్యే పదవి లేకుంటే అది లేదనే దిగులుతోనే నువ్వు, మీ చిన్నాన్న చనిపోతారు’’ అని పెద్దారెడ్డి, వెంకటరామిరెడ్డిలను ఉద్దేశించి కామెంట్  చేశారు.

వాళ్ల మాదిరిగా  దోచుకోవడం తమకు చేతకాదని అన్నారు. కారులో కూర్చొని కారుకూతలు కూస్తున్నారని విమర్శించారు. కాఫీకి పిలిస్తే మీ ఇంటికైనా వస్తానని అన్నారు. ‘‘మీ తాత చనిపోతే పోలేకపోయారు. పోలీస్ లేకుంటే మీ చిన్నాన్న ఒక్క అడుగువేస్తాడా. మీ నాన్నను చంపిన వాళ్ళతో ఎందుకు రాజీ అయ్యారు’’ అని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. 

ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చీనీ మొక్కలు నాటిన ఏడాదికే రూ.13.89 లక్షల పంట నష్టం పరిహారం అందిందని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల ఆరోపణలు చేశారు. పుట్లూరు మండలం కోమటికుంట్ల గ్రామంలో ఉన్న పెద్దారెడ్డి చీనీ తోటను పరిశీలించడానికి వెళ్తానని ప్రకటించారు. పెద్దారెడ్డి చీనీ తోటకు వస్తానని, దమ్ముంటే ఆపాలంటూ సవాలు విసిరారు. ఈ నేపథ్యంలో పోలీసులు జేసీని గృహ నిర్బంధం చేశారు.

అయితే జేపీ ప్రభాకర్ రెడ్డి సవాలుపై స్పందించి పెద్దారెడ్డి.. తనకు వ్యవసాయం అంటే ఇష్టమనే సంగతి అందరికి తెలిసిందేనని అన్నారు. అందరూ రైతులు మాదిరిగానే తమ కుటుంబ సభ్యులకు కూడా ఇనూరెన్స్ వచ్చిందని అన్నారు. ఎమ్మెల్యేలు అయితే వ్యాపారం చేయకూడదు, వ్యవసాయం చేయకూడదని చట్టం ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. జేపీ ప్రభాకర్ రెడ్డికి వ్యవసాయం లేదని.. ప్రజల మీద పడి దోచుకోవడమే తెలుసునని విమర్శించారు. ఎమ్మెల్యే పదవి తనకు వైఎస్ జగన్ పెట్టిన భిక్ష అని.. ఆ పదవి లేకుంటే జేపీ ప్రభాకర్ రెడ్డిని  ఇంట్లో నుంచి ఈడ్చుకుని పోయి కొట్టేవాడినని అన్నారు. తాను కొడితే సింపతి వస్తుందని అతడు ఆలోచన చేస్తున్నాడని.. అతడి దోపిడీ, దొంగతనాల గురించి ప్రజలకు తెలుసునని అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios