తనను జైల్లో చంపేయాలని చూశారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో  ఆయన విమర్శలు కురిపించారు. కాగా.. గురువారం ఆయన జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో.. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు. రాజకీయ వేధింపుల్లో భాగంగానే అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని వాపోయారు. రవాణా శాఖ నిబంధనలు తు.చ. తప్పకుండా పాటించామని, జైలు అధికారులు ఎటువంటి ఇబ్బందులకు గురి చేయలేదని, కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం తనపై నిఘా ఉంచారని వ్యాఖ్యానించారు.

 ముగ్గురు ఎమ్మెల్యేలు తాను జైల్లో ఎలా ఉంటున్నానో నిఘా వేసి ఉంచారని, జైల్లో తన కదలికలపై ఎప్పటికప్పుడు ఆరాతీశారని ఆరోపించారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతి రెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి , అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మరికొంతమంది రాయలసీమ నేతలు.. జైల్లో ఇబ్బందులు పెట్టేలా బయట నుంచి ప్రయత్నించారన్నారు.

కరోనాతో  జైల్లోనే చంపేయాలని చూశారన్నారు. 68 సంవత్సరాల వయస్సున్న వ్యక్తిని కరోనా సమయంలో జైల్లో పెట్టడం ఏంటని ప్రశ్నించారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి రెడీ అన్నారు.  తాడిపత్రి ప్రజల్లో నూతనోత్సాహం చూశానని, గతంలో ఎప్పుడూ ఇంటి నుంచి బయటికి రాని మహిళలు సైతం బయటకు వచ్చి హారతులు ఇచ్చారన్నారు.