చంద్రబాబు ఫోన్: యూటర్న్ తీసుకున్న జెసి దివాకర్ రెడ్డి

JC Diwakar Reddy takes u turn after Chandrababu's call
Highlights

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డికి ఫోన్ చేశారు. 

అనంతపురం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డికి ఫోన్ చేశారు. దాంతో జేసి తన నిర్ణయంపై యూటర్న్ తీసుకున్నారు. అనంతపురం రోడ్డు వెడల్పునకు నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు చేసిన తర్వాత జేసి చల్లబడ్డారు. 

మిగతా విషయాలు ఏమైనా ఉంటే అవిశ్వాస తీర్మానం వ్యవహారం పార్లమెంటులో ముగిసిన తర్వాత మాట్లాడుదామని చంద్రబాబు జెసి దివాకర్ రెడ్డికి చెప్పారు. కేంద్రం ప్రభుత్వంపై అవిశ్వాసం రాష్ట్ర భవిష్యత్తుకు ముఖ్యమని కూడా చెప్పారు. ఐదు కోట్ల మంది ప్రజల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశమని, లోక్‌సభకు హాజరు కావాలని చంద్రబాబు జేసిని కోరారు. సీఎం విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన జేసీ తాను ఢిల్లీకి వెళ్తానని చెప్పారు. 

అవిశ్వాస తీర్మానంలో పాల్గొంటానని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చంద్రబాబు ఫోన్ చేసిన తర్వాత ప్రకటించారు. తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ వెళుతున్నట్టు తెలిపారు. తనకు ఎటువంటి డిమాండ్స్ లేవని అన్నారు. ప్రజలకు ఉపయోగపడేవి చెప్పి ఉంటే చెప్పానని, అది తన విధి అని అన్నారు. 

తనతో సీఎం చంద్రబాబు మాట్లాడారని, ఢిల్లీకి వెళ్లమని చెప్పారని అన్నారు. 15 ఏళ్ల తర్వాత అవిశ్వాసంపై ఓటింగ్ జరుగుతోందని, వెళ్లకపోతే పార్టీకి మచ్చ వస్తుందని ఆలోచించుకోవాలని చెప్పారని జేసి చెప్పారు. 

తన వల్ల పార్టీకి మచ్చ రావడం ఇష్టం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తానని చెప్పారు. రాజీనామా గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా రేపు సాయంత్రం మాట్లాడదామని సమాధానం దాటేశారు. బుధవారం ఢిల్లీకి వెళ్లనని చెప్పిన మాట వాస్తవమే అని, రేపు సాయంత్రం మిగతా విషయాలు మాట్లాడదామనిస తొందర ఏముందని ఆయన అన్నారు.

loader