Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుకు షాక్: జెసి దివాకర్ రెడ్డి ధిక్కారం

తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ ఎంపీ జెసి దివాకర్ రెడ్డి షాక్ ఇచ్చారు. మోడీ ప్రభుత్వంపై టీడీపి అవిశ్వాసం తీర్మానం ఈ నెల 20వ తేదీన చర్చకు రానున్న నేపథ్యంలో విప్ ధిక్కరించడానికి జెసి దివాకర్ రెడ్డి నిర్ణయించుకున్నారు. 

JC Diwakar Reddy may defy TDP whip

అనంతపురం: తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి షాక్ ఇచ్చారు. ఈ నెల 20వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం లోకసభలో చర్చకు రానున్న నేపథ్యంలో జెసి దివాకర్ రెడ్డి ధిక్కార స్వరం వినిపించారు. 

తమ పార్టీ ఎంపీలకు తెలుగుదేశం పార్టీ విప్ జారీ చేసిన విషయం తెలిసిందే. విప్ జారీ చేసినా పార్లమెంటుకు వెళ్లేది లేదని జెసి దివాకర్ రెడ్డి అంటున్నారు. జెసి దివాకర్ రెడ్డి అనంతపురంలోనే ఉండిపోయారు. తాను పార్లమెంటుకు హాజరు కావడం లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. ఓ తెలుగు న్యూస్ టీవీ చానెల్ తో ఆయన మాట్లాడారు. తాము అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రతిపాదిస్తున్నామనే విషయం స్పష్టంగా చెప్పామని, అందుపల్ల పార్లమెంటుకు వెళ్లకపోయినా ఫరవా లేదని ఆయన అన్నారు. 

ఏం చేసినా, ఏం జరిగినా ప్రధానిగా మోడీ ఉన్నంత వరకు రాష్ట్రానికి ఏమీ రాదని ఆయన అన్నారు. తప్పులను ప్రజలకు తెలియజెప్పడం తప్ప అంతకు మించి తాము చేసేదేమీ లేదని అన్నారు. ప్రజలకు తెలియజెప్పడానికి లోకసభలో ముగ్గురు తమ సభ్యులు మాట్లాడుతారని ఆయన అన్నారు. 

టీడీపీ ఎంపీల బృందానికి నేతృత్వం వహిస్తున్న సుజనా చౌదరి వైఖరిపై దివాకర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తనను పట్టించుకోవడం లేదని ఆయన అలిగినట్లు చెబుతున్నారు.  అవిశ్వాసంపై మద్దతు కోరుతూ వివిధ పార్టీల నాయకులను కలవాల్సిన ఎంపీల బృందంలో జేసీ ఉన్నారు. 

బృందానికి నేతృత్వం వహిస్తున్న సుజనా చౌదరి సొంతపోకడలకు పోతున్నారని ఆరోపిస్తున్నారు. సుజనా వైఖరితో ఆగ్రహానికి గురైన జేసీ అవిశ్వాస తీర్మానానికి హాజరయ్యేది లేదని తేల్చి చెప్పారు. జేసీని బుజ్జగించేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు.

తాను పార్లమెంటుకు హాజరు కావడం లేదనే విషయాన్ని చంద్రబాబుకు చెప్పాల్సిన అవసరం ఏం ఉందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే సమాచారం ఆయనకు చేరి ఉంటుందని దివాకర్ రెడ్డి అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios