అనంతపురం: అనంతపురం రూరల్ పోలీసు స్టేషన్ లో మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డిని నిర్బంధించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన పోలీసు స్టేషన్ కు వచ్చారు. అయితే, పోలీసులు ఆయనను పోలీసు స్టేషన్ లోనే ఉంచారు. 

శనివారం సాయంత్రం ఆరున్నర గంటల దాకా పోలీసు స్టేషన్ లోనే ఉన్నారు. అప్పటికే ఆరు గంటలు దాటింది. దీంతో తాడిపత్రి నుంచి ఆయన అనుచరులు అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ తరలిరావడానికి సిద్ధపడ్డారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసు స్టేషన్ ముందు ఓ కార్యకర్త ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. 

జేసీ దివాకర్ రెడ్డిని వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తూ ఆయన ఆ ప్రయత్నం చేశాడు. అయితే, ,షూరిటీలు పరిశీలించడానికి మాత్రమే జేసీని స్టేషన్ లో ఉంచామని పోలీసులు చెబుతున్నారు. ముందస్తు బెయిల్ కోసం జేసీ సమర్పించిన పేపర్లను పరిశీలించడానికి పోలీసులు పుట్లూరు వెళ్లారు. కాగా జేసీకి మద్దతుగా స్టేషన్ కు రావడానికి ప్రయత్నించిన పల్లె రఘునాథరెడ్డి, పార్థసారథి, తదితర టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read: పోలీసుల ముందు జేసీ దివాకర్ రెడ్డి సరెండర్: గంటల కొద్దీ స్టేషన్ లోనే..

తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి శనివారంనాడు అనంతపురం రూరల్ పోలీసు స్టేషన్ లో లొంగిపోయారు. పోలీసులపై ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై కేసు నమోదైంది. 

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులతో బూట్లు నాకిస్తామని, గంజాయి కేసులు పెడుతామని ఆయన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలోనే అన్నారు. దాంతో జేసీపై అనంతపురం జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు త్రిలోక్ నాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఆ ఫిర్యాదు మేరకు జేసీపై 153, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో జేసీ దివాకర్ రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోోయారు. సొంత పూచీకత్తుతో పాటు నెలకు రెండు సార్లు పోలీసు స్టేషన్ కు వచ్చి సంతకాలు చేయాలని కోర్టు షరతు పెట్టింది.