అనంతపురం: తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి శనివారంనాడు అనంతపురం రూరల్ పోలీసు స్టేషన్ లో లొంగిపోయారు. పోలీసులపై ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి ఆయనపై కేసు నమోదైంది. 

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులతో బూట్లు నాకిస్తామని, గంజాయి కేసులు పెడుతామని ఆయన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలోనే అన్నారు. దాంతో జేసీపై అనంతపురం జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు త్రిలోక్ నాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఆ ఫిర్యాదు మేరకు జేసీపై 153, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో జేసీ దివాకర్ రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోోయారు. సొంత పూచీకత్తుతో పాటు నెలకు రెండు సార్లు పోలీసు స్టేషన్ కు వచ్చి సంతకాలు చేయాలని కోర్టు షరతు పెట్టింది.

న్యాయస్థానం ఆదేశాల మేరకు స్టేషన్ కు వచ్చిన జేసీ దివాకర్ రెడ్డి పోలీసులు నిర్బంధించారనే విమర్శలు వస్తున్నాయి. ఆయన ముందస్తు బెయిల్ కోసం పోలీసు స్టేషన్ కు వచ్చారని, అయితే బెయిల్ ఇవ్వకుండా ఐదు గంటల పాటు స్టేషన్ లోనే ఉంచారని అంటున్నారు. 

సమాచారం తెలిసిన మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. పోలీసు స్టేషన్ అవరణ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు మీడియా ప్రతినిధులను హెచ్చరించినట్లు విమర్శలు వస్తున్నాయి.