అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించడానికి వీలుగా జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆయన శుక్రవారం ఆ వ్యాఖ్యలు చేశారు. 

జగన్ వంటి ముఖ్యమంత్రి మళ్లీ దొరకడని, జగన్ ఏడాది పాలనకు వందకు 110 మార్కులు వేస్తానని ఆయన అన్నారు. జగన్ పట్టుదల పరాకాష్టకు చేరిందని చెప్పడానికి హైకోర్టు తీర్పే ఉదాహరణ అని ఆయన అన్నారు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనడాన్ని జగన్ మానుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. 

రాజ్యాంగం జోలికి వెళ్తే ఇలాంటి తీర్పు వస్తాయని ప్రభుత్వానికి ముందే తెలుసునని, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లడం ప్రభుత్వం ఇష్టమని ఆయన అన్నారు. జగన్ శ్రీరాముడో.. రావణుడో ప్రజలే తేల్చుకోవాలని ఆయన అన్నారు. చరిత్ర అనే పుస్తకంలో తనకు ఒక్క పేజీ ఉండాలనేది జగన్ ఆలోచన అని ఆయన అన్నారు. 

టీటీడీ ఆస్తులు అమ్మాలని వైవీ సుబ్బారెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం జగన్ సంక్షేమంపై దృష్టి సారించారని, సంక్షేమానికి ఓట్లు పడవనే విషయం 2019లోనే తేలిందని ఆయన అన్నారు.