సమయం మించిపోయిన తర్వాత నిబంధనల ప్రకారం పాస్ ఇవ్వటం సాధ్యం కాదని తేల్చిచెప్పారు సిబ్బంది. దాంతో ఒక్కసారిగా జెసి వారిపై మండిపడుతూ అక్కడున్న ప్రింటర్ ను విసిరేసారు. దాంతో సిబ్బందితో పాటు అక్కడున్న ప్రయాణీకులు కూడా ఆందోళనతో అక్కడి నుండి పారిపోయారు.

అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి వీరంగం చేసారు. విశాఖపట్నం విమానాశ్రయంలో తనకు బోర్డింగ్ పాస్ ఇవ్వనందుకు జెసి ఆగ్రహంతో ఊగిపోయారు. ఇంతకీ ఏం జరిగిందంటే, విశాఖపట్నం నుండి హైదరాబాద్ కు వెళ్ళేందుకు జెసి విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే, ఆయన వచ్చేటప్పటికే బోర్డింగ్ పాస్ ఇచ్చే సమయం అయిపోయింది. మిగిలిన ప్రయాణీకులకందరకీ పాస్ లు ఇచ్చేసిన సిబ్బంది కౌంటర్ను మూసేసారు.

సిబ్బంది కౌంటర్ను మూసేసిన తర్వాత తీరిగ్గా వచ్చిన జెసి తన పాస్ గురించి వాకాబు చేసారు. జరిగిన విషయాన్ని సిబ్బంది జెసికి వివరించారు. అయితే, వారి మాటను జెసి వినలేదు. తనకు బోర్డింగ్ పాస్ ఇవ్వాల్సిందేనంటూ సిబ్బందితో వాదనకు దిగారు. సమయం మించిపోయిన తర్వాత నిబంధనల ప్రకారం పాస్ ఇవ్వటం సాధ్యం కాదని తేల్చిచెప్పారు సిబ్బంది. దాంతో ఒక్కసారిగా జెసి వారిపై మండిపడుతూ అక్కడున్న ప్రింటర్ ను విసిరేసారు. దాంతో సిబ్బందితో పాటు అక్కడున్న ప్రయాణీకులు కూడా ఆందోళనతో అక్కడి నుండి పారిపోయారు.

జెసి చర్యలను సిబ్బంది విమానాశ్రయంలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసారు. విమానాశ్రయంలోని సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించటం జెసికి ఇదే మొదటిసారి కాదు. గతంలో విజయవాడ విమానాశ్రయ సిబ్బంది విషయంలో కూడా ఇదే విధంగా వ్యవహరించారు. తాజా ఘటనలో సిబ్బంది ఫిర్యాదుతో ఉన్నతాధికారులు జెసి ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి.