జేసీ బ్రదర్స్ గురించి తెలియని వాళ్లు చాలా అరుదుగా ఉంటారనడంలో అతిశయోక్తిలేదు. సుదీర్ఘకాలంగా రాజకీయాలతో అనుబంధం ఉన్న ఈ అన్నదమ్ములు.. మీడియా ముందు ఏది మాట్లాడినా సంచలనంగానే ఉంటుంది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన వీరు.. 2014లో టీడీపీలో చేరారు.

కాగా.. 2019లో ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఈ ఇద్దరు అన్నదమ్ములు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తామిద్దరం పోటీ చేడయం లేదని స్పష్టం చేశారు. వారికి బదులు.. వారి కుమారులను రంగం దించాలని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని.. తాడిపత్రి మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా ప్రకటించారు. తన కుమారుడు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని స్పష్టం చేశారు.

అదేవిధంగా తన అన్న జేసీ దివాకర్ రెడ్డి పవన్ కుమార్ రెడ్డి.. అనంతపురం ఎంపీగా పోటీ చేస్తాడని ఆయన తెలిపారు. ఇప్పటికే పవన్ కుమార్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలు ఎన్నికలకు సిద్ధమౌతున్నారు. అస్మిత్ రెడ్డి ఇంటింటికీ తెలుగు దేశం కార్యక్రమం ద్వారా.. తాడిపత్రి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.