జేసీ సోదరులు మౌనదీక్ష చేపడతామని ప్రకటించడంతో అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పోలీసులు నిర్వీర్యం చేస్తున్నారంటూ తాడిపత్రి ఎమ్మార్వో కార్యాలయం వద్ద మౌనదీక్ష చేపడతామని ఇటీవల జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో పోలీసులు జేసీ సోదరలును గృహనిర్బంధం చేశారు. జేసీ దివాకర్ రెడ్డిని జూటూరులోని ఆయన తోటలో, ప్రభాకర్ రెడ్డిని తాడిపత్రిలోని ఆయన స్వగృహంలో నిర్బంధించారు. పట్టంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాడిపత్రిలో గత నెల 24న వైకాపా, తేదేపా నాయకుల మధ్య జరిగిన రాళ్ల దాడికి సంబందించి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. 

పోలీసుల తీరుకు నిరసనగా జేసీ సోదరులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి తహసీల్దారు కార్యాలయం వద్ద మౌనదీక్ష చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అప్రమత్తమైన పోలీసుశాఖ అనంతపురం నుంచి తాడిపత్రి వరకు భారీగా పోలీసులను మోహరించింది. తాడిపత్రి వెళ్లే వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. 

144 సెక్షన్, 30 పోలీస్ యాక్టు అమల్లో ఉందని.. ధర్నాలు, నిరసనలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా జేసీ సోదరులను గృహ నిర్బంధం చేసినట్లు పేర్కొన్నారు. 

జేసీ ప్రభాకర్ రెడ్డిని గృహనిర్బంధం చేయడంతో ఆయన భార్య ఉమారెడ్డి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఇచ్చేందుకు ఆమె ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు ఎమ్మార్వో కార్యాలయానికి సిబ్బంది చేత తాళం వేయించారు. ‘నా బాధ్యతను నా భార్య ఉమారెడ్డి పూర్తి చేస్తోంది’ అని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.