అమరావతి: కృష్ణా జిల్లాలో వరదల ప్రభావం ఎలా ఉన్నా కానీ డ్రోన్ల రాజకీయం మాత్రం రసవత్తరంగా మారుతోంది. చంద్రబాబు నివాసంపై అక్రమంగా డ్రోన్లు నిర్వహించారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. చంద్రబాబు హత్యకు కుట్రలో భాగంగానే డ్రోన్ తో విజువల్స్ తీయించారంటూ ఆరోపిస్తోంది. అంతేకాదు గవర్నర్ కు సైతం ఫిర్యాదు చేసింది.

డ్రోన్లను వరద ప్రవాహాన్ని అంచనా వేసేందుకే వినియోగించామే తప్ప చంద్రబాబు నివాసానికి మాత్రమే కాదని వైసీపీ సమర్థించుకుంటుంది. చంద్రబాబు నివాసం వరదలో మునిగిపోయిందని ఆయన విలువైన సామాగ్రిని తరలించుకుపోయారని అందులో ఇంకేమి ఉందంటూ వాదిస్తోంది. 

ఏపీలో కీలకమలుపులు తిరుగుతున్న డ్రోన్ల రాజకీయాలపై జనచైతన్యవేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. నీటిపారుదల శాఖ ఆదేశాలతోనే వరద ప్రాంతాల్లో డ్రోన్‌ వినియోగించారని స్పష్టం చేశారు. 

వరద ప్రవాహం ఉన్న అన్ని ప్రాంతాల్లో డ్రోన్‌ వినియోగించిన విషయాన్ని వి.లక్ష్మణ్ రెడ్డి గుర్తు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం మీదనే డ్రోన్‌ వినియోగించారనడం సరికాదని హితవు పలికారు. 

చంద్రబాబు తాను ఉంటున్న అక్రమ భవనాన్ని ఖాళీ చేసి ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. వరద వేగాన్ని నిరంతరం గమనిస్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా వరద ప్రవాహాన్ని ప్రభుత్వం నియంత్రించడాన్ని హర్షిస్తున్నట్లు తెలిపారు. 

డ్రోన్లతో ఎప్పటికప్పుడు విజువల్స్ తీసుకుంటూ వరద తీవ్రతను అంచనా వేయడంలో ప్రభుత్వం విజయవంతమైందని ప్రశంసించారు. వాటి ఆధారంగానే లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయడంతో తక్కువ నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ నిరంతరం సమీక్షలు జరుపుతూ సూచనలు ఇవ్వడం హర్షణీయమన్నారు.