డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ బర్త్‌డేకి జనసేన భారీ ప్లాన్‌.. ఏం చేయబోతున్నారంటే..?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబరు 2న గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఇందుకోసం జనసేన పార్టీ భారీగా ప్లాన్ చేస్తోంది. ఆయా కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ పాల్గొనాలని  జనసేన పీఏసీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.
 

JanaSena's Grand Plans for Pawan Kalyan's Birthday on September 2: Clean Andhra-Green Andhra Initiative GVR

సెప్టెంబరు 2వ తేదీన నిర్వహించే కార్యక్రమాలపై జనసేన నాయకులతో ఆంధ్రప్రదేశ్‌ పౌర సరఫరాల శాఖ మంత్రి, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు, ఎమ్మెల్సీ శ్రీ హరిప్రసాద్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ... రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినమైన సెప్టెంబరు 2వ తేదీన పార్టీ నాయకులు, శ్రేణులు కలిసి ప్రజోపయోగ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమాజానికి అవసరం అయ్యే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సెప్టెంబరు 2వ తేదీన అంతా కలిసి ‘క్లీన్ ఆంధ్ర – గ్రీన్ ఆంధ్ర’ కాన్సెప్ట్‌తో కార్యక్రమాలను ఊరువాడా ఘనంగా నిర్వహిద్దామన్నారు. ఇందులో పార్టీలోని ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. 

JanaSena's Grand Plans for Pawan Kalyan's Birthday on September 2: Clean Andhra-Green Andhra Initiative GVR

సెప్టెంబరు 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు పార్టీ తరఫున నిర్వహించాల్సిన కార్యక్రమాలపై మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు, ఎమ్మెల్సీ శ్రీ పి.హరిప్రసాద్ టెలీకాన్ఫరెన్స్ ద్వారా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులతో మాట్లాడారు. 

‘‘సమాజాన్ని ఎంతో ఇష్టపడే నాయకుడిగా, ప్రకృతిని అమితంగా ప్రేమించే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఆలోచనలు, ఆశయాల మేరకు ఆయన పుట్టిన రోజున క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. సమాజ హితమైన కాన్సెప్ట్ ఇది. ప్రజలంతా మెచ్చేలా కార్యక్రమాలు చేపడదాం. క్లీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కాలువలను శుభ్రం చేయడం, బహిరంగ ప్రదేశాలను శుభ్రం చేయడం, స్కూళ్లు, ఇతర ప్రాంతాలను స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉండేలా చేయడం వంటి కార్యక్రమాలు చేయాలి. కాలువలు, చెరువులు, మురుగు కాలువలు పరిశుభ్రం చేసుకుందాం. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో దోమల బెడద ఉందని సమాచారం ఉంది. ఈ క్రమంలో పారిశుధ్య నిర్వహణపై ప్రజలకు అవగాహన పెంచుదాం. విశాఖపట్నం, కాకినాడ, బాపట్ల... ఇలా సాగర తీరం ఉన్న ప్రాంతాలవారు బీచుల్లో ప్లాస్టిక్, చెత్త ఏరివేత లాంటివి కార్యక్రమాలు చేపట్టవచ్చు..’’ అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

దేశీయ జాతులు, పర్యావరణహితమైన మొక్కలు నాటాలి

అలాగే, గ్రీన్ ఆంధ్రలో భాగంగా సామాజిక అటవీ విభాగం నుంచి మొక్కలను తీసుకొని.. వాటిని అవసరం అయ్యే ప్రాంతాల్లో నాటాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ‘‘రోడ్లకు ఇరువైపులా, డివైడర్లలో విరివిగా మొక్కలు నాటాలి. సోషల్ ఫారెస్ట్ విభాగంలోని నర్సరీల వద్ద అవసరం అయిన మొక్కలను నిర్దేశిత మొత్తం చెల్లించి ముందుగానే తెచ్చుకొని... వాటిని సెప్టెంబరు 2వ తేదీన అన్ని ప్రాంతాల్లో నాటే విధంగా ప్రణాళిక చేసుకోండి. భవిష్యత్తులో భారీ వృక్షాలుగా పెరిగేందుకు అవకాశం ఉన్న రావి, వేప, ఉసిరి, కానుగ, చింత లాంటివి నాటేందుకు ఎక్కువగా మొగ్గు చూపండి. దేశీయ జాతులు, పర్యావరణ హితమైన మొక్కలు నాటాలి. డివైడర్స్ మధ్య నాటేందుకు అవసరమైన మొక్కలు స్థానిక నర్సరీల్లో ఉంటాయి.’’ 
‘‘ఉదయం నుంచి ఈ కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా మొదలు కావాలి. నాయకులు ఆయా ప్రాంతాల్లోని పార్టీలోని ప్రతి ఒక్కరినీ సమన్వయం చేసుకొని కార్యక్రమాలు నిర్వహించాలి. కార్యక్రమంలో పార్టీ జెండాలు, కండువాలను కప్పుకొని ఉత్సాహంగా ముందుకు కదలాలి. ప్రజల సూచనలు, సలహాలు తీసుకొని వారికి అసవరం అయ్యే కార్యక్రమాలను రూపొందించుకోండి. ప్రజలను కూడా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసేలా చూడండి. కేవలం కార్యక్రమం నిర్వహించి వదిలేయకుండా అవి భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఓ ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు రూపొందించుకోండి. అలాగే ప్లాస్టిక్ రహితంగా మీ ప్రాంతాలను తీర్చిదిద్దడంపైనా అవగాహన కల్పించండి. ప్రజల్లోకి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఉన్నతమైన ఆలోచనలు వెళ్లడంతో పాటు, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా చేసే ఈ కార్యక్రమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అంతా మెచ్చేలా, అందరికీ నచ్చేలా సెప్టెంబరు 2వ తేదీన వాడవాడలా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజును పండుగలా చేద్దాం’’ అని నాదెండ్ల మనోహర్ కోరారు. 
 
ప్లాస్టిక్ రహిత ఆంధ్రకు మొదటి అడుగు వేద్దాం: నాగబాబు 

అనంతరం టెలీ కాన్ఫరెన్స్‌లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబు మాట్లాడుతూ... పార్టీ తీసుకున్న కార్యక్రమాన్ని ప్రతి జన సైనికుడు, వీర మహిళ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. క్లీన్ ఆంధ్ర – గ్రీన్ ఆంధ్ర కార్యక్రమం కచ్చితంగా పవన్ కళ్యాణ్ మెచ్చే కార్యక్రమం అవుతుందన్నారు. ఆయనకు మనమంతా స్వచ్ఛ హరిత హారాన్ని బహుమతిగా అందిద్దామని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ రహిత ఆంధ్రగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమం ద్వారా మొదటి అడుగు వేయాలన్నారు. 
‘‘ప్లాస్లిక్ అనేది మానవాళికి భూతంలా పరిణమించింది. ఓ ప్లాస్టిక్ వస్తువు భూమిలో కరగడానికి వందల ఏళ్లు పడుతుంది. దీన్ని రాష్ట్రంలో నిషేధించేలా, ప్రజలంతా స్వచ్ఛందంగా ప్లాస్టిక్ ను వదిలేసేలా వారిలో చైతన్యం తీసుకొద్దాం. నాకు మొక్కల పెంపకం అంటే చాలా ఇష్టం. నా ప్రతి పుట్టిన రోజుకు 300 మొక్కలను నాటి, వాటిని పూర్తి స్థాయిలో సంరక్షించే బాధ్యతను తీసుకుంటాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజునా ఆయనకు ఎంతో నచ్చే మొక్కల నాటడం, వాటిని సంరక్షించే కార్యక్రమం తీసుకోవడం చాలా గొప్పగా ఉంది. ప్రతి మనిషి తన జీవితంలో 100 మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలి. ఆ బాధ్యతను సెప్టెంబరు 2వ తేదీ నుంచి మొదలుపెడదాం’’ నాగబాబు పిలుపునిచ్చారు. 

స్వచ్ఛ హరిత సంకల్పం తీసుకుందాం: ఎమ్మెల్సీ హరిప్రసాద్ 

టెలీ కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ... “పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున ప్రతి ఒక్కరూ స్వచ్ఛ హరిత సంకల్పం తీసుకోవాలి. ప్రజలందరికీ ఉపయోగపడేలా కార్యక్రమాలు నిర్వహించాలి. మొక్కలను తూతూమంత్రంగా నాటి వదిలేయకుండా, వాటిని సంరక్షించే ఏర్పాట్లు చేయండి. స్వచ్ఛ కార్యక్రమాలు కూడా అందరికీ ఉపయోగపడే విషయాలను తీసుకొని చేయండి. కార్యక్రమానికి ముందు ఎలా ఉందో, తర్వాత ఎలా ఉందో ఫొటోలు తీయండి. కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సమన్వయంతో ముందుకు వెళ్లాలి. ప్రతి ఒక్కరినీ కలుపుకొని వెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’’ అన్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్యవర్గం, వీర మహిళా ప్రాంతీయ కో- ఆర్డినేటర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ బాధ్యులు పాల్గొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios