Asianet News TeluguAsianet News Telugu

రాపాకకు మరోసారి జనసేన ఆహ్వానం: వాలంటీర్లపై నిందలేసిన నాదెండ్ల

సోమవారం సాయంత్రం రాజోలు నియోజకవర్గం మలికిపురంలో జనసేన పార్టీ బహిరంగ సభ నిర్వహించారు. జనసైనికులు భారీ సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేశారు ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ మాట్లాడారు 

Janasena Requests MLA Rapaka Varaprasada rao To Return To the Party Fold
Author
Rajolu, First Published Mar 23, 2021, 9:13 AM IST

పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో దౌర్జన్యాలు, వాలంటీర్ వ్యవస్థ బెదిరింపులు వల్లే వైసీపీ గెలిచింది కానీ, నిజాయితీగా ఎన్నికల్లో పోరాడి ఉండుంటే రిజల్ట్ వేరేలా ఉండేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్లాలని వైసీపీని భారీ మెజార్టీతో ప్రజలు గెలిపిస్తే... 151 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని తిరోగమనంలో తీసుకెళ్తున్నారని అన్నారు. ఏడాదిన్నర కాలంలో ఒక్క పెట్టుబడిగానీ, ఒక్క కంపెనీగానీ, యువతకు ఒక్క ఉద్యోగం కానీ రాలేదన్నారు. 

కేవలం ఏడాదిన్నర కాలంలో రూ. లక్షా ఎనభై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం అప్పు చేసిందని, ఎవరి కోసం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. సోమవారం సాయంత్రం రాజోలు నియోజకవర్గం మలికిపురంలో జనసేన పార్టీ బహిరంగ సభ నిర్వహించారు. జనసైనికులు భారీ సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేశారు

ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “రాష్ట్రంలో కులాలను విభజించింది, కులాల గురించి మొట్టమొదట మాట్లాడింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే.  బీసీలకు 56 కార్పొరేషన్లు పెట్టి వాళ్లను విభజించారు.  కాపులకు రిజర్వేషన్ ఇచ్చేదే లేదని ఉభయగోదావరి జిల్లాల పర్యటనలో కులాల గురించి మాట్లాడారు.  

తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోండి

"అగ్రవర్ణాల్లో చాలా పేదరికం ఉంది. దానిని ఎవరూ గుర్తించడం లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలి. వైఎస్ కుటుంబంలా... అగ్రవర్ణాల్లో అందరూ ధనవంతులే అయి ఉండరు. ఈడబ్ల్యూఎస్ ఎలా అమలు చేయాలో తెలియకపోతే పక్కన ఉన్న తెలంగాణా రాష్ట్రాన్ని చూసి నేర్చుకోండి. తెలంగాణ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ ఎలా అమలు చేస్తుందో. అలాగే 30 శాతం పీఆర్సీ కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మీరు ఎందుకు ప్రకటించలేదు?  ఉద్యోగులకు భరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు. దీనిపై సమాధానం చెప్పాలి. ఎన్నికలు ప్రచారంలో ఒక మాట, గెలిచాక ఒక మాట మాట్లాడకూడదు." అని అన్నారు  

హరిప్రసాద్ పార్టీ మారి ప్రజలకు ఏం ప్రయోజనం?

"రాజోలు నియోజకవర్గం శాసనసభ్యుడికి సమస్య వస్తే శ్రీ పవన్ కళ్యాణ్ డీజీపీ గారికి ఫోన్ చేసి అరెస్టును ఆపించారు. ఇదే శాసనసభ్యుడు ఈ రోజు ఇదే పోలీస్ వ్యవస్థను మనపైన ఉపయోగిస్తున్నారంటే ఎంతో బాధ కలిగిస్తోంది. ఎప్పుడైతే శాసనసభ్యుడు మన పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్లిపోయారో ఆ పార్టీ ఆయన్ను ఆదరించినట్లు, గౌరవించినట్లు మాకైతే ఎక్కడ కనిపించలేదు. నిజంగా అభివృద్ధి కోసమే పార్టీ మారితే నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలకు సీసీ రోడ్లు, రక్షిత మంచినీటిని అందించారా? అర్హులైన అందరికి ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, సంక్షేమ పథకాలు ఇప్పించారా?  ఇవేవి జరగనప్పుడు ఎందుకు పార్టీ మారారు? ప్రజలకు ఏ విధంగా న్యాయం జరిగిందో చెప్పాలి. రక్షిత మంచినీటి కోసం ధర్నా చేయాల్సిన పరిస్థితి ఈ నియోజకవర్గంలో నెలకొంది. మీరు నిజంగా నీతికి, నిజాయతీకి కట్టుబడి ఉంటే గుడిమెళ్ళంక రక్షిత మంచి పథకాన్ని పూర్తి చేసి ప్రజలకు నీరందించండి.  లేకపోతే ఆ కార్యక్రమాన్ని జనసేన పార్టీయే పూర్తి చేసే విధంగా మా వంతు కృషి చేస్తాం. ఈ రోజు బహిరంగంగా రాపాక గారికి చెబుతున్నాను.. మీరంటే శ్రీ పవన్ కళ్యాణ్ కి గౌరవం, నమ్మకం. కిందస్థాయి నుంచి కష్టపడి పైకొచ్చారు. మీ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోండి. అలాగే మిమ్మల్ని గెలిపించిన జనసైనికుల గౌరవాన్ని నిలబెట్టండి. వాళ్ళు కోరుకున్నట్లు జనసేన పార్టీ తరపున పని చేయండి. ఈ సభ వేదిక నుంచి మమ్మల్ని  మరొక్కసారి మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాను." అని వ్యాఖ్యానించారు 

ఈ  ఇసుక రేట్లతో సామాన్యుడు బ్రతకగలడా..?

"రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. రోజు రోజుకి రాష్ట్రాన్ని దిగజారుస్తున్నారు.  నిన్న మళ్లీ కొత్త ఇసుక విధానం ప్రకటించారు. ఎన్నిసార్లు ప్రకటిస్తారో వారికే అర్ధం కావడం లేదు. ఇంతకు ముందు ఫోన్ చేస్తే చాలు ఇసుక మీ ఇంటికే వస్తుందని ప్రచారం చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. ఎంతమంది ప్రయత్నించినా ఒక్కరికి కూడా ఇసుక బుక్ కాలేదు. అంతా మోసం. గతంలో వెయ్యి రూపాయలకు దొరికే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు రూ. 4వేలు అయ్యింది. సామాన్యుడు ఎలా బతకాలి?  ఇళ్లు ఎలా కట్టుకోవాలి? నిర్మాణ రంగం ఎలా నిలబడుతుంది? దేనికోసం ఈ దగా? ఇంకెత సంపాదిస్తారు? ప్రజల కోసం నిజాయతీగా నిలబడి సేవ చేయండి. దయచేసి మోసం చేయకండి.  వాలంటీర్లకు కూడా మేము ఒకటే చెబుతున్నాం. సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని ఇంటింటికి వెళ్లి భయపెట్టించకండి. మీ పథకాల ద్వారా ఓట్లు పడతాయి అనుకుంటే పొరపాటే. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను, ప్రజా వ్యతిరేకతను జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయండి. లేకపోతే ఆయనను మోసం చేసినవాళ్లవుతారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షాన్ని బలపరిచే వాళ్లు కొందరు ఉంటే... ప్రతిపక్షాలకు అండగా నిలబడే వారు అంతే మంది ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్న వారు కూడా కోరుకునేది రాష్ట్రానికి మేలు చేయమని, బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేయమనే, దానిని విస్మరిస్తే 151 మందిని తిరస్కరించే రోజు దగ్గరలోనే ఉంటుంది." అని అభిప్రాయపడ్డారు. 

సామాన్యుడి వేదిక జనసేన

"పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అన్ని ఏకగ్రీవాలు చేయాలని ముఖ్యమంత్రి, మంత్రులు చూశారు. నామినేషన్లు వేసిన వారిని బెదిరించి విత్ డ్రా చేయించారు. కానీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిలుపుతో ఎప్పుడు రోడ్లు మీదకు రానీ మహిళలు కూడా ఇవాళ బయటకు వచ్చి నామినేషన్లు వేశారు. ఎన్నికల ప్రక్రియలో ధైర్యంగా నిలబడి పోరాడారు. ఇంటింటికి తిరిగారు. మీరు మాకు ఓటు వేస్తే నిజాయతీగా మీ కోసం పనిచేస్తామని చెప్పారు. ఇవాళ పార్టీ నుంచి బీసీ, ఎస్సీ, మహిళలు ఇలా ఎంతో మంది గెలిచారు. కేవలం రూ. 15 వేలు ఖర్చు చేసి సర్పంచు అయిన వాళ్లు కూడా ఉన్నారు. నిజాయతీగా పనిచేసే ఎందరో వ్యక్తులు ఇవాళ గెలిచారు.  రాజకీయ లబ్ధి కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కులాలను ఏనాడు వాడుకోలేదు. సామాన్యుడికి ఒక వేదిక కల్పించాలని జనసేన పార్టీ స్థాపించారు.  శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు. అన్ని కులాలకు చెందిన వ్యక్తి. అయితే ఆయన ఒక కులంలో పుట్టారు. ఆ సామాజక వర్గం పార్టీ కోసం క్షేత్రస్థాయిలో జెండా మోసింది. ఈ రోజు ఇంతమంది ఇతర కులాల వ్యక్తులు సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలిచాలరంటే దాని వెనుక వాళ్లకష్టం ఉంది.  పార్టీని ఇన్నాళ్లు మోసింది వాళ్లే. వాళ్లను కచ్చితంగా గౌరవిస్తాం, ఆదరిస్తాం"  అని తెలిపారు. 

ఛలో అసెంబ్లీ చేపట్టి తీరుతాం

"నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన 5 జిల్లాల రైతులను శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరామర్శించారు. వారి కష్టాలను దగ్గరనుంచి చూసి చలించిపోయారు.  కష్టాల నుంచి రైతులు గట్టెక్కాలంటే తక్షణ ఆర్థిక సాయం కింద రూ. 30 వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆ రోజు డిమాండ్ చేశారు. అన్ని ప్రాంతాల్లో జనసేన నాయకులు దీక్ష శిబిరాలు ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలబడ్డారు.  ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. రైతు భరోసా పథకం మూడో విడత కింద కేంద్రం నుంచి వచ్చే      నిధులు విదిల్చి ప్రభుత్వ పెద్దలు చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా,  రైతులకు అండగా ఉండేందుకు శాసనసభ సమావేశాల మొదటి రోజు ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి జనసేన పిలుపునిచ్చింది. జనసేన నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా యువత ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి" అని పిలుపునిచ్చారు. 

కొన్ని విషయాలపై బీజేపీ అధినాయకత్వంతో మాట్లాడి, అవసరమైతే ఒత్తిడి తెచ్చైనా రాష్ట్రానికి మేలు చేసే విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ పనిచేస్తారు తప్ప కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు, ఎవరినో మభ్య పెట్టడానికి ఆయన పనిచేయరని, స్థానిక ఎన్నికల నుంచి పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తుందని, సార్వత్రిక ఎన్నికల్లో 6 శాతం ఓట్లు వస్తే, పంచాయతీ ఎన్నికల్లో 27 శాతం వచ్చాయని, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో 14 శాతం ఓటు బ్యాంకు వచ్చిందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

మూడు నెలల్లో లక్ష సభ్యత్వాలు

"క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం మొదలు పెట్టి కేవలం మూడు నెలల్లోనే లక్ష సభ్యత్వాలు పూర్తి చేశాం. మొదటి విడతలో అగ్రస్థానంలో నిలబడింది రాజోలు నియోజకవర్గం. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.  జనసైనికుల్లో భరోసా నింపడానికి, వారి రాజకీయ భవిష్యత్తుకు తోడ్పాటు అందించడానికి ఈ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం ఉపయోగపడుతుంది. యువకులు బైక్ ర్యాలీల్లో పాల్గొంటారు వారి కోసం ఏదైనా బీమా పాలసీ తీసుకురావాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో కృషి చేస్తున్నారు. ఈ రోజున దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా రూ. 5 లక్షల ప్రమాద బీమా తీసుకొచ్చారు. ప్రమాదం జరిగితే అప్పటికప్పుడు రూ 50 వేలు అందేలా కార్యక్రమాన్ని రూపకల్పన చేశార”ని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios