ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీపై ఇటీవల కొన్ని ఆరోపనలు హాట్ టాపిక్ గా మారాయి. పవన్ కళ్యాణ్ గారికి అమరావతి ప్రాంతంలో 62 ఎకరాల భూములు ఉన్నాయని సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన జనసేన లీగల్ విభాగం ఈ వార్తలను సీరియస్ గా తీసుకుంది. జనసేన కో ఆర్డినేటర్ హెచ్చరిక జారీ చేస్తూ ప్రకటన విడుదల చేశారు.

'జనసేనను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక నీచ బుద్ధితో బురద చల్లడానికి కొందరు ప్రజా వ్యతిరేకులు కుట్రలు పన్ని తమ అనుచరగణంతో వాటిని అమలు చేస్తున్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని జనసేన చేస్తున్న ప్రజా పోరాటానికి కోట్లాది గొంతులు తోడు ఉన్నాయి. ఎదురొడ్డి పోరాడలేని అల్పబుద్ధి గల వాళ్ళే - జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అమరావతి ప్రాంతంలో 62 ఎకరాల భూములు ఉన్నాయని, తప్పుడు పత్రాలు సృష్టించి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు.

ఇలా ప్రచారం చేస్తున్నవారిపైనా, సోషల్ మీడియాలో వక్ర రాతలు రాస్తున్నవారిపైనా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన లీగల్ విభాగం నిర్ణయించింది. ఈ ప్రచారానికి కారకులైన వారిపై పరువు నష్టం దావా వేయనున్నాము. ఒకటి రెండు రోజులలో వారందరికీ లీగల్ నోటీసులు పంపుతామని జనసేన పార్టీ కోఆర్డినేటర్ సాంబశివ ప్రతాప్ లేఖలో పేర్కొన్నారు.