అమరావతి: తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుల సస్పెన్షన్ పై జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల సస్పెన్షన్ కక్ష సాధింపులా ఉందంటూ ఆరోపించారు. అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కేవలం తిట్టుకోవడానికే సభకు వచ్చినట్లు ఉందంటూ చురకలు అంటించారు.

అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన బిల్లులను స్వాగతించాల్సిందేనని చెప్పుకొచ్చారు. జగన్ ప్రవేశపెట్టిన చట్టం అమలు కాకపోతే ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేయవచ్చునని అయితే ఇంకా ఏమీ కాకుండానే విమర్శలు చేస్తారా అంటూ ప్రశ్నించారు. 

నియోజకవర్గ సమస్యలను చర్చించాలనే తాపత్రాయంతో తనలాంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తే ఇక్కడ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందన్నారు. అధికార పార్టీకి కొన్ని రోజులు సమయం ఇద్దామని అప్పటికీ వారు ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే నిరసనలకు దిగుదామని సూచించారు. 

గతంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీ నేతలు తిట్లతో విమర్శలకు దిగితే...నాడు అధికారంలోకి వచ్చిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే పంథాన నడుస్తోందన్నారు. ఇరు పార్టీలు తిట్టుకోవడం ఆపేసి ఇకపై ప్రజాసమస్యలపై చర్చించాలని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ హితవు పలికారు.